పుట:ఉషాపరిణయము (పసపులేటి రంగాజమ్మ).pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

127


గీ.

అంత బలదేవమదనవిహంగనాథు
లెంతయుం బేర్చి యార్చిరి సంతసమున
నసురభీకరఘనరవంబయిన పాంచ
జన్యమును వేగ పూరించెఁ జక్రధరుఁడు.

54


మహేశ్వరశక్తిపీడితుఁడగు బలదేవుఁడు శ్రీకృష్ణునివలన తద్విముక్తిఁ జెందుట

వ.

అంత నిట్లు కింకరసైన్యంబు దైన్యంబుఁ జెంది సంగరంబుఁ
జాలించి భయంబున దిశలన్ సంభ్రమించు నవసరంబున మహే
శ్వరప్రేరితంబైన మహాజ్వరంబు భయంకరాకారంబై హస్త
మస్తకచరణత్రితయంబులు గలిగి భసితప్రహరణంబై ధారాధర
సహస్రంబునుంబోలె గర్జింపుచు వచ్చి వాసుదేవాగ్రజునిం గని.


మ.

ఎటు బోవంగలవాఁడ వింక నిదె యుద్వృత్తిన్ నినుం గిట్టి మ
త్పటుబాహాబలయుక్తిఁ జూపెద మదాంధత్వంబు ప్రాపించి న
న్నిటులేలా యెఱుఁగంగఁజాల విటమీఁ దెట్లయ్యెదో యంచు ను
త్కటహాసంబు నొనర్చి పైఁబడియె నుద్యన్ముష్టిబంధోగ్రమై.

55


గీ.

రౌహిణేయుఁడు నెదిరించి బాహుయుద్ధ
కౌశలముఁ జూపి మండలాకారముగను
దిరిగెఁ దిరుగ మహేశ్వరజ్వరము నొంచి
యతని యతిఘోరముష్టిప్రహారములను.

56


వ.

మఱియు నమ్మహేశ్వరజ్వరంబు.


క.

తన సవ్యకరమునందలి
ఘనభసితము బలునిరొమ్ముఁ గదియఁగ వ్రేయన్
జని యదియు నతనివక్షం
బునఁ బడె నొకకొండభంగి భూరిస్ఫూర్తిన్.

57