పుట:ఉషాపరిణయము (పసపులేటి రంగాజమ్మ).pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

122

ఉషాపరిణయము


సేయునెడ వాసుదేవుండు రథారూఢుండై ముంగలన్ బ్రకా
శించు నంగిరుం జూచి యిట్లనియె.


క.

నీవును మఱియును గల యీ
పావకులును రణమునందు భయకంపితులై
పోవక నిలిచిన మఱి నా
లావుం గనియెదరు మీదులావును దెలియున్.

34


గీ.

అనినఁ గోపము రెట్టింప నంగిరుండు
కృష్ణుపైనిఁ ద్రిశూలంబుఁ ద్రిప్పివైవ
నంతలోననె శౌరియు నర్ధచంద్ర
విశిఖముల నేసి కావించె విశిఖముగను.

35


వ.

మఱియును.


క.

స్థూణాకర్ణాస్త్రము హరి
తూణంబునఁ దిగిచి రొమ్ముఁ దూఱఁగ నేయన్
శోణితము లొలుక నతఁడున్
బ్రాణంబులు తల్లడిల్ల వ్రాలె న్నేలన్.

36


అంగిరుని గూల్చి శ్రీకృష్ణుఁడు బాణుపురమును బ్రవేశించుట

వ.

ఇట్లుగ్రచరుండైన యంగిరుండు మూర్ఛాపరవశుండై పడిన
శేషించిన పావకు లతని రథమున నుంచుకొని బాణపురంబుఁ
బ్రవేశించి రంత.


గీ.

అంబుజాక్షుండు సింహనాదంబుఁ జేసి
భవ్యతరలీలఁ బూరించెఁ బాంచజన్య
మప్పు డాశౌరి గనుపట్టె నమృతకరుని
వెడలఁ గ్రాయు నభంబన విను నరేంద్ర!

37