పుట:ఉషాపరిణయము (పసపులేటి రంగాజమ్మ).pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

123


క.

బలదేవప్రద్యుమ్నులు
నలఘుతరస్ఫూర్తి మెఱయ నట్లన శంఖం
బులుఁ బూరింపంగ నల హరి
బలిమిఁ బ్రవేశించె వేగ బాణునిపురమున్.

38


వ.

అప్పుడు శోణితపురంబునందు.


స్రగ్ధర.

ప్రద్యుమ్నాపేతసంకర్షణముఖకమలప్రస్ఫురద్దివ్యశంఖ
ప్రోద్యద్భూరిప్రణాదంబులు బహుపటహవ్యూహభేరీరవంబుల్
సద్యస్సన్నద్ధయోధాలఘురచితమహాసాహసక్ష్వేళనంబుల్
మాద్యత్పక్షీంద్రపక్షోల్లసితమహితఝంపాధ్వనుల్ గూడినిండెన్.

39


గీ.

పట్టణము నాల్గుదిక్కులఁ బ్రబలి యిట్లు
భీషణంబగునట్టి యాఘోష మమరె
వననిధులు నాల్గు నొక్కదిక్కునను గూడి
భాసురంబుగ నొక్కట మ్రోసె ననఁగ.

40


శంభుబలములు శ్రీకృష్ణాదుల నెదుర్కొనుట

ఉ.

శోణపురంబు వారలును జొచ్చుతరిన్ బహుయక్షపూర్వగీ
ర్వాణమహోద్భటప్రమథరాక్షసకోటులు విస్ఫురద్గదా
బాణమహోగ్రతోమరగృపాణములన్ ధరియించి యంబుద
శ్రేణులలీల గర్జనము సేయుచు నెంతయు భీషణాకృతిన్.

41


క.

ఒక్కుమ్మడి వడి నడచుచు
నక్కజముగ నార్చి పేర్చి యతితీష్ణములౌ
పెక్కమ్ముల నానలుగురి
వెక్కసముగఁ బొదవి రెల్లవీరులు మెచ్చన్.

42