పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/248

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

15


క.

ద్వాదశవార్షికమగు క్రతు
వాదరమునఁ జేయుచున్న యమ్మౌనుల సం
పాదితపుణ్యఫలము దా
నై దైవికఘటన సూతుఁ డట కేతెంచెన్.

60


క.

ఏతెంచిన సూతుం గని
యా తాపసముఖ్యులెల్ల నతనికి వినయో
పేతమతి నుక్తవిధిచే
నాతిథ్యము చేసి రప్పు డధికప్రీతిన్.

61


సీ.

అంతట నర్హాసనాసీనుఁడైయున్న
        సూతు సద్వినయసమేతుఁ జూచి
యప్పుణ్యకుశలంబు నడి యాయన దమ్ము
        నడిగినఁ దమసేమ మర్థిఁ జెప్పి
యుచితభాషణముల నొక్కింతవడి కాల
        యాపనం బొనరించి యనఘచరిత!
యఖిలపురాణరహస్యంబు గరతలా
        మలకమై యుండు నీమదికి నెపుడు


గీ.

శైవధర్మసదాచారసరణి మిగుల
వినఁ బ్రియంబగుఁ జెప్పవే విశదఫణితి
ననుచుఁ దన్నట్లు ప్రార్థించి యడుగు శౌన
కాదిమౌనుల కిట్లను నతఁడు ప్రీతి.

62


చ.

అనఘవిచారులార! వినుఁ డాగమతత్త్వమునందు మీ యెఱుం
గనియది లేదు నన్నుఁ ద్రిజగన్వినుతోదయుఁ జేయఁగాఁ దలం
చినపని కాదె యే నొకటి చెప్పఁగ విందు మటంచు నిట్లు మీ
యునికి భవత్కృపాగరిమ నొందితిఁ జెందితి భాగ్యసంపదన్.

63