పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

15

ఉద్భటాచార్యచరిత్రము


ఉ.

వాలుక లెన్నవచ్చు నుడువర్గము లెన్నఁగవచ్చు భూరజో
జాలము లెన్నవచ్చు నతిచంచలవార్ధివికీర్ణవీచికా
మాలిక లెన్నవచ్చు బుధమండలకర్ణపుటామృతంబు తా
బాలశశాంకశేఖరుని భవ్యచరిత్రము లెన్నవచ్చునే?

64


ఉ.

అంగదయోగసిద్ధికిఁ బ్రయాసముఁ బొందఁగ నేల సంశయా
బ్ధిం గడు ముంపుచున్న బహుభిన్నపథంబులఁ బోవనేల? భ
క్తిం గనఁజాల (కావృషభకేతను)ను బ్రస్తుతి సేయుచుండినన్
దంగెటిజున్ను గాదె హిమధామకిరీటుఁడు భక్తకోటికిన్.

65


ఉ.

ఆకులఁ గందమూలముల నంబుఫలంబులఁ గూరగాయలం
జేకొని ప్రాణరక్షణముఁ జేసి మహాటవిలోనఁ దీవ్రని
ష్ఠకలనన్ శరీరము గృశంబుగ నుండిన ముక్తి గల్గునే?
ప్రాకటమైన భక్తిఁ బురభంజనుఁ బూజ యొనర్పకుండినన్.

66


సీ.

మ్రొక్కు నెవ్వాఁ డష్టమూర్తికి నలవోక
        బలె నాతఁ డమరులప్రణతియందుఁ
జల్లు నెవ్వాఁడు ధూర్జటిమీఁదఁ బుడిసెడు
        జలము లాతఁడు సుధాజలధిఁ దేలు
నుతియించు నెవ్వాఁడు శితికంఠు నేకవా
        రం బాతఁ డల వచోరమణి నేలు
నిలుపు నెవ్వాఁ డీశు నిమిషమాత్రము మనం
        బున నాతఁ డామీఁది పొడవుఁ దెలియుఁ


గీ.

గాన మ్రొక్కఁగ నభిషిక్తుఁగా నొనర్ప
వినుతిసేయంగఁ దవిలి భావింప నెందుఁ
దగిన దేవాదిదేవుఁ డాతండు సూవె
భుక్తిముక్తు లపేక్షించు భక్తులకును.

67