పుట:ఉదాహరణపద్యములు.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

51

వ్యాసులకు - ప్రబంధపరమేశ్వరుని నారసింహపురాణము
సీ. ప్రోగులై యెందును ప్రోగేర్పడకయున్న
శ్రుతులన్నియును నోలి సూత్రపఱచి
ముఖ్యశాస్త్రంబులు మునికోటి చదివించి
యెల్లచోట్లను వెలయింపఁబనిచె
నాదిపురాణంబు లయ్యైమతంబుల
పేరులు పెట్టి రూపించి తెలిపి
పంచమవేదమై పరగు మహాభార
తముచేసి పురుషార్థసమితిఁ బ్రోచె
గీ. పుట్టినప్పుడ సంస్కృతి పొలము గడపు
గట్టి యెరుకబండినప్రోడ పట్టి గనియె
నెవ్వఁ డట్టి సద్గురు నుతించి భక్తి
విష్ణుమాహాత్మ్యకథ మీకు విస్తరింతు.

నిశ్శంకుని కొమ్మయ – వీరమాహేశ్వరము
సీ. పులినంబు తొలుచూలు పుండరీకాక్షుని
యవతారభేదంబు కవులరాజు
బహుపురాణగ్రంథభారతసంహితా
పరిగుంభనక్రియాపండితుండు
కఱ్ఱివన్నియవాఁడు కౌరవాన్వయకర్త
శ్రుతు లేర్పరించిన సూత్రధారి
సిద్ధనీవారముష్టింపచాధ్యక్షుండు
శుకునికూరిమితండ్రి సకలవేది
గీ. కాళికేయుండు యోజనగంధిపట్టి
తత్త్వనిర్ణేత ఘనతపోధర్మరాశి
నైమిశారణ్యమునిసభాభూమి కెలమి
నేగె నొకనాడు వ్యాసమునీశ్వరుండు.