పుట:ఉదాహరణపద్యములు.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

50

కవిస్తుతి - తెలుఁగుకవుల సమూహమునకు - ఆంధ్రకవి రామయ్య కాంచీమహత్త్వము
సీ. శబ్దశాసనకావ్యసంఘట్టనక్రమా
నందిత బుధవర్యు నన్నపార్యు
నుభయభాషారచోన్నిద్రభద్రవ
చోరాజిఁ దిక్కనసోమయాజి
లక్ష్యలక్షణకళాలంకారసౌభాగ్య
సత్కావ్యవిన్యాసు శంభుదాసు
ఛందోనిబంధన చాతురీధౌరేయ
వాగ్ధాము వేములవాడ భీము
తే. రసికజనపద్మదిననాథు రంగనాథుఁ
బ్రకటకృతికర్మనిస్తంద్రు భాస్కరేంద్రు
నమితరసభావు శ్రీత్రిపురారిదేవు
సూక్తితిమిధాము నాచనసోముఁ దలఁతు.

వసిష్ఠుకు - పద్మపురాణము – మణికి సింగరాజు
చ. కనియె శ్రుతిస్మృతిప్రకరగాఢతరార్థపటిష్ఠు దివ్యబో
ధనపదవీమహత్వసముదగ్రగరిష్ఠుఁ దపోవిశేషసం
జనితనితాంతపుణ్యగణసంచయనవ్రతనిష్ఠు శేముషీ
జనితహితప్రభావమునిసంఘవరిష్ఠు వశిష్ఠు నయ్యెడన్.

చ. పరమవివేకసాగరుఁడు పంకజసంభవసంభవుండు ధూ
మరహితవహ్నితుల్యుఁ డసమానతపోనిధి విష్ణుభక్తి త
త్పరుఁ డఘదూరుఁ డాద్యుఁడు కృపారసచిత్తుఁడు దివ్యబోధనా
స్థిరుఁ డగు నవ్వసిష్ఠుఁ డరుదెంచె దిలీపనృపాలు పాలికిన్.

భారతము - (వ్యాసులకు)
ఉ. ప్రాంశుపయోదనీలతనుభాతు నుజ్జ్వలదండధారుఁ బిం
గాంశు జటచ్ఛటాభరణు నాగమపుంజపదార్థతత్వని
స్సంశయకారుఁ గృష్ణమృగచర్మకృతాంబరుకృత్యు భారతీ
వంశవివర్ధనుం ద్రిదశవందితు సాత్యవతేయు గొల్చెదన్.