పుట:ఉదాహరణపద్యములు.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

42

నన్నయభట్టు ఆదిపర్వము - శేషునికి
చ. బహువనపాదపాబ్ధికులపర్వతపూర్ణసరస్సరస్వతీ
సహితమహామహీతల మజస్రసహస్రఫణాలిదాల్చి దు
స్సహతరమూర్తికిన్ జలధిశాయికిఁ బాయక శయ్యయైన య
య్యహిపతి దుష్కృతాంతకుఁ డనంతుడు మాకుఁ బ్రసన్నుఁ డయ్యెడున్.

భైరవుని శ్రీరంగమహత్వము
మ. శయనంబై యుపధానమై నిలయమై సచ్ఛత్రమై పాదుకా
ద్వయమై మంగళపీఠమై మృదులవస్త్రంబై సమస్తోచిత
క్రియలన్ జక్రికి నిత్యసన్నిహితమూర్తిన్ బొల్చు శేషాహి న
క్షయమేధానిధిఁ గావ్యలక్షణకళాచార్యుం బ్రశంసించెదన్.

హనుమంతునికు - భైరవుని శ్రీరంగమహత్వము
చ. పరిచరుఁగాఁగనేలె నిరపాయచరిత్రుని శత్రుకానన
స్ఫురదురునీతిహోత్రుని సముజ్జ్వలమేరుసమానగాత్రునిన్
బరమపవిత్రుని న్మునిసుపర్వతతిస్తుతిపాత్రునిన్ మనో
హరఫలశేముషీకబళితాంబుజమిత్రుని వాయుపుత్రునిన్.

చినమల్లు శ్రీగిరన్న – శ్రీరంగమహత్వము
శా. సంతోషంబునఁ బొంది యేలె విమలస్వాంతున్ మహాదానవ
ధ్వాంతవ్యూహవిదారణోజ్జ్వలవివస్వంతున్ యశఃపూరితా
శాంతున్ సాహసవంతు నిర్భరజయాయత్తైకవిశ్రాంతు ధీ
మంతున్ భర్మనగేంద్రకాంతుని హనూమంతున్ జవాత్యంతునిన్.

రాయసం గణపయ – సౌగంధికాపహరణము
శా. అంతంతం గబళింపఁగాఁ గడఁగి బాలార్కున్ ఫలభ్రాంతివే
శంతోల్లంఘనకేలి దాటెను సరస్వంతున్ మహాదానవా
క్రాంతారామమహీరుహంబుల నుదగ్రక్రీడఁ ద్రుంచెన్ హనూ
మంతుండున్ గపి యున్నవిం గపులె సామాన్యాటవీచారముల్.