పుట:ఉదాహరణపద్యములు.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

38

భావన పెమ్మనంగారి అనిరుద్ధచరిత్రము
సీ. ఘనపక్షవిక్షేపజనితవాతాహతిఁ
బర్వతశ్రేణుల పాదుగదల,
విపులాస్యకర్ణికావిర్భూతదీప్తుల
వలయాద్రి యవ్వల వెలుకఁబార
శతకోటిశరచండజవభవారవముల
శరధులు ఘూర్ణిల్లి బరలుగడవ
వితతాద్భుతాపాది విభ్రమోదితకాంతి
దెసలహోమద్యుతి దీటుకొనఁగ
గీ. సిద్ధచారణ గణనుతశ్రీఁ (దన)ర్చి
మింటఁ బరఁగు రెక్కలతోడి మేరువనఁగ
వచ్చెఁ దన రాక కఖిలంబుఁ బిచ్చలింపఁ
బక్షిదేవుండు బుండరీకాక్షుకడకు.

ప్రెగ్గడ హరివంశము
సీ. సర్వ(పథీనుఁడై) చను పతంగుండు గ
లఁడొకాక యరయ నన్యుఁడు జగమున
నెఱకలు వడసి యెయ్యెడఁ బ్రవర్తిల్లెడు
మేరఁగాంచెనొకాక మేరుశిఖరి
అంబరశ్యామకయంబుధి పొగరుగా
భ్రమసి యెక్కెనొగాక బాడబాగ్ని
హైమమై పరగు బ్రహ్మాండంబు పక్వమై
తగఁబుట్టెనోకాక ఖగ మొకండు
గీ. వైనతేయుండు నీదృశవ్యాప్తిదీప్తుఁ
డాతఁడోకాక యితఁడని యఖిలజనులు
బహువిధానుమానారంభపరతఁ జూడ
నరుగుదెంచెఁ బక్షిప్రభుఁ డభ్రవీథి. (అ5-141ప)