పుట:ఉదాహరణపద్యములు.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

33

సీ. నీలాద్రి దనరు మాణిక్యపు శిఖరంబు
క్రియ నూత్నరత్నకిరీట మెసఁగ
గగనంబు నడిమిచక్కటినొప్పు నరుణాంశు
కరణిఁ గౌస్తుభము వక్షమున వెలుఁగ
జలరాశి బొదివిన సాంధ్యపయోదంబు
క్రమమున పీతాంబరము దలిర్ప
మేచకాభ్రంబున మెరయు సురేంద్రచా
పము లీల వనమాల ప్రస్ఫురిల్ల
గీ. నల్లనునుజాయ మేనొప్పఁ దెల్లదమ్మి
విరుల సిరిగన్న కనుదోయి యరుదుగాఁగ
నమరు జగదీశు సకలహితార్థజన్ము
జన్మవిరహిత వసుదేవజాతఁ గాంచి.

(ప్రెగడగారి నరసింహపురాణము)



దశావతారములకు - భీమనచెప్పినది.
సీ. శ్రుతిసుధాక్ష్మాభక్తసురజననీవధూ
మల్లశంకరధర్మ మహితబుద్ధి
కగకూర్మ కిటినరమృగ కుబ్జరామ రా
మానంతబుద్ధకల్క్యాహ్వయముల
నముచిమందరకుదానవబలార్జునపంక్తి
ముఖముష్టికస్థి విముక్తఖలులఁ
పుచ్ఛాగ్రపృష్టవిస్ఫురదంష్ట్రనఖగుణ
పరశుబాణకరాంగఖురపుటములఁ
ఆ. జెరివి తార్చి యెత్తి చేరి బంధించి ని
ర్జించి యేసి యోర్చి చెరిచి మట్ట
గడఁగనున్న శౌరి కరుణాకరుఁడు శుభా
కరుఁడు మా కభీష్టపరుఁడుగాఁత.