పుట:ఉదాహరణపద్యములు.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32

సీ. పుండరీకములతోఁ బురుడించు గన్నులఁ
గారుణ్యమను తేనె గడలుకొనఁగ
మందారశాఖతోఁ మలయఁజాలెడు గేలఁ
బాంచజన్యంబను పండు మెఱయ
నుదయాద్రితటముతో నుద్దించు నురమునఁ
గౌస్తుభంబును దివాకరుఁడుఁ దోపఁ
నాకలోకంబుతో నవ్వు పాదంబున
నాకాశనది యను నమృత మొప్ప
గీ. నమృతధారాధరము మాటలాడినట్లు
భాగ్యదేవత రూపు చేఁబట్టినట్లు
లలితగతినున్న సద్గుణాలంకరిష్ణు
విష్ణుఁ బొడగంటి భవములు వీడుకొంటి.

సీ. పన్నగంబుల రాజుఁ బగవాఁడు గూడి నీ
శయనంబుఁ బయనంబు సంతరింప
దుగ్ధవారాసికూతురు నాలుఁగూడి నీ
శరణంబుఁ జరణంబు నవదరింపఁ
జందురుచెలికాఁడు సైదోడుగూడి నీ
యుల్లంబు మొల్లంబు నుపచరింపఁ
దామరపగవాఁడు దయితుండుఁగూడి నీ
బడినూపు గుడినూపుఁ బరికరింపఁ
గీ. గంపమానమనోద్యానగతులు మాన
నేకతంబున్న మునులను నేకతంబు
లేక పొడగానవచ్చు నీలీలఁ గాన
నన్యుఁ డేనాటి ధన్యుండె యంబుజాక్ష.

(సోముడు)