పుట:ఉదాహరణపద్యములు.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

29

సీ. నారాయణునకుఁ బ్రణామంబు గావింతు
నడుగుల కెరఁగుదు నచ్యుతునకుఁ
గైటభారికి నమస్కారంబు వాటింతు
మ్రొక్కుసేయుదు నాదిమూలమునకు
వందనం బొనరింతు వాసుదేవునకును
దండ మొనర్తు గదాధరునకుఁ
బ్రణుతి సంపాదింతుఁ బరిపూర్ణమూత్రికి
నంజలి ఘటియింతు నఖిలపతికి
గీ. ననుచు నానందభరితులై యమరదైత్య
మునినరోరగముఖ్యులు వినతు నగుచుఁ
గొలువనొప్పు జగత్పతిఁ గొలుతు నిన్ను
నఖిలభూతాత్మ యాదినారాయణాత్మ.

సీ. ఆరఁగాఁ బండిన నల్లనేరెడుబండు
మెఱుఁగున మెఱుఁగారు మేనివాఁడు
వెదవెద విరిసిన విరిదమ్మిరేకులఁ
దెగడు కన్నులుగల మొగమువాఁడు
మెండైన యేనికతుండంబు మెచ్చని
యిరుదోయి చేతులం బరగువాఁడు
దొమ్మిదిరూపుల తుమ్మెదవాయని
పువ్వదామరగల బొడ్డువాఁడు
గీ. గలిమిముద్దియ యురమునఁ గలుగువాఁడు
కడగి మిన్నేటిసెలయైన యడుగువాఁడు
వన్నెగల పైడిచీరల వన్నెకాఁడు
నేడు నాచూడ్కి జుట్టమై నిలిచెననుచు