పుట:ఉదాహరణపద్యములు.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

25

సీ. వేదాదులగు మహావిద్యలన్నియుఁ గూడి
మూర్తిమంతంబులై మొనసి కొలువఁ
గ్రతుమరీచ్యంగిరకణ్వాదిసంయముల్
పలుమాఱుఁ గనుసన్నఁ బనులు సేయ
సురసిద్ధకిన్నరగరుడవిద్యాధర
యక్షాదు లంతంత నభినుతింప
నారదవిశ్వసనత్కుమారాంగిర
శతరుతు లుభయపార్శ్వముల మెఱయ
గీ. భాషతోఁగూడి యానందభరితుఁడగుచు
సత్యలోకేశ్వరుండుండు సంస్తుతింప
నిమ్మహాసృష్టికెల్లను నితఁడు కర్త
చూడుమీ బ్రహ్మలోకంబు సుభగమూర్తి

(పెదపాటి సోమయ - కేదారఖండము)



సరస్వతికి—
చ. అమృతమువంటితల్లి కమలాసనుబట్టపుదేవి వేదశా
స్త్రముల విహారభూమి కలప్రాణులకెల్లను బల్కుదోడు వి
శ్వమున సమస్తవిద్యల విశారద శారద నాదువక్త్రప
ద్మమున వసించి మత్కృతి జమత్కృతి పుట్టఁగఁజేయుఁగావుతన్.

ఉ. వెన్నెలరూపు గప్పురపువేలుపు వజ్రపుబొమ్మలెల్లఁ దా
బన్నిన నొప్పులెస్సమునఁ బంకజమధ్యమునందుఁ బొల్చి క్రీఁ
గన్నుల బ్రహ్మఁ జూచి చిలుకం బలికించుచునున్నవాణి యు
ద్సన్నవశబ్దభావరసతత్త్వము మత్కృతికిచ్చు నెప్పుడున్

(గంగరాజు చౌడన్న – నందచరిత్రము)