పుట:ఉదాహరణపద్యములు.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

24

సీ. పైఁడిచాయలతోడి పక్షసంపుటముల
మెలఁగుదేజుల తేరు గలుగునతని
మొకరితుమ్మెదలకు మకరందరసధార
లొసఁగు బీఠమున గూర్చుండునతని
సత్కవీంద్రుల మానసములలో విహరించు
గొమరాలి కింపులు గులుకునతని
దిక్కులు నాల్గింట లెక్కదప్పకయొప్పు
నాననంబుల మాటలాడునతనిఁ
గీ. గనిరి యింద్రానలాంతకదనుజవరుణ
పవనభవసఖేశానపూర్వకముగాఁగ
నమరులందరు మధుకైటభాసురేంద్ర
మదవిమర్దకనాభిపద్మజుని నజుని.

(నిశ్శంకుని కొమ్మయ)



సీ. మహనీయతర యాజమాన సూత్రంబులు
జపియించు ముఖచతుష్టయము దనర
పావననవనీతపరిలేపనంబున
మెఱుఁగెక్కియున్న క్రొమ్మేను వెలుఁగ
బహుచిత్రమృదుసూక్ష్మపక్ష్మశోభితమైన
హరిణాజినోత్తరీయంబు మెఱయ
శ్రీవత్సలాంఛన శ్రీమూర్తిచింతన
సంభృతానందబాష్పములు దొరుగ
గీ. శారదాదేవి సావిత్రి శ్రద్ధ తుష్టి
మతియుఁ గుశసూత్రకాంచిధామములు వెట్టి
నెమ్మిఁ గొలువంగ దర్భాసనమ్ముమీఁదఁ
జూడ నొప్పెఁ బితామహసోమయాజి.

(కుడిచెర్ల తిప్పరాజు – కాంచీమాహాత్మ్యము)