పుట:ఉదాహరణపద్యములు.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16

క్పర్వంబై పొడిగట్టిపేర్చిన మదిం గంబంబ యంచుం గన
ద్గర్వోన్మీలితనేత్రుఁడై మొరయు వేదండాననుం గొల్చెదన్.

శా. జేజేయంతు భజింతు నిష్టఫలసంసిద్ధుల్ మదింగోరి ని
ర్వ్యాజప్రౌఢి గృపావలంబుని గటప్రస్యందిదానాంబునిం
బూజాతత్పరదేవదానవకదంబున్ బాలకేలీకలా
రాజత్కౌతకరంజితోరగపతిప్రాలంబు హేరంబునిన్.

(శ్రీనాథుని నైషధము)



శా. విఘ్నధ్వాంతనిరాసవాసరపతిన్ వేదండరాజాననున్
విఘ్నాధీశ్వరునిం గపోలఫలకావిర్భూతదానచ్ఛటా
నిఘ్నాళిన్ నిరుపాధికాధికకృపానిత్యోదయోపఘ్నుఁ గ్రౌం
చఘ్నాజ్యేష్ఠు భజింతుఁ గావ్యరచనాచాతుర్యసంసిద్ధికై.

(భావన పెమ్మన – అనిరుద్ధచరిత్రము)



ఉ. తొండము నేకదంతమును దోరపుబొజ్జయు వామహస్తమున్
మెండుగమ్రోయు గజ్జెలును మెల్లనిచూపును మందయానముం
గొండొకగుజ్జురూపమునఁ గోరినవిద్యకెల్ల నొజ్జయై
యుండెడు బార్వతీతనయు నోలి గణాధిపుఁ బ్రస్తుతించెదన్.

శా. క్రీడాలోలత దంతకోరకశిఖిం గీలించి భూచక్రముం
గ్రోడగ్రామణి మించియెత్తి ఫణు లక్షుద్రానుమోదంబునం
జూడాభోగము లెత్తిచూఁడఁగ దిశాశుండాలరాణ్మండలిన్
వ్రీడం బొందఁగఁ జేయు దంతిముఖు నిర్విఘ్నార్థమై కొల్చెదన్.

(కాకమాని గంగాధరుని బాలభారతము)



ఉ. ఆదరమొప్ప మ్రొక్కిడుదు నద్రిసుతాహృదయానురాగసం
పాదికి దోషభేదికిఁ బ్రపన్నవినోదికి విఘ్నవల్లికా
చ్ఛేదికి మంజువాదికి నశేషజగజ్జననందమోదికిన్
మోదకఖాదికిన్ సమదమూషకసాదికి సుప్రసాదికిన్.

(బమ్మెర పోతరాజు – భాగవతము)