పుట:ఉదాహరణపద్యములు.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

13

అంబికాస్తుతి

చ. చులుకనఁ జాపముం దిగుచుచోఁ గటకాముఖపాణిమీఁదఁ బొ
ల్లొలయు నఖాంశులం గదిసి యొప్పెడు గెంజిగురాకు గుత్తిచే
నలవడి కర్ణపూరమున నంటిన తుమ్మెదవోని పార్వతీ
లలన కటాక్షదృష్టి మనలం జరితార్థులఁ జేయుఁ గావుతన్.

(కానుకొలను అన్నమరాజు – అమరుకము)



ఉ. కూడెడు వెండ్రుకల్ నిడుదకూఁకఁటఁ బ్రోవఁగ జోడు పైవళుల్
(జూడగ) దోఁపఁ గ్రొమ్మొలకచన్నుల మించు దలిర్ప సిగ్గునం
జూడఁగ నేరముల్ మెఱుఁగుఁజూపుల నీన హిమాద్రియింట నీ
వాడుట శూలికిన్ మనమువాడుట గాదె తలంప నంబికా.

(త్రిపురాంతకుఁడు – అంబికాశతకము)



సీ. ప్రణవపీఠిక నెక్కి భాసిల్లు నేదేవి
యామ్నాయహేమహర్మ్యాగ్రవీథిఁ
జరియించు నేదేవి సహజారుణజ్యోతి
రానందమూర్తియై బ్రహ్మనాడి
నేదేవి ఠవణిల్లు నిచ్ఛాక్రియాజ్ఞాన
శక్తిభేదమున విశ్వంబు నిండి
తోడునీడయుఁ బోలెఁ దులకించు నేదేవి
యెల్లకాలంబు విశ్వేశుఁ గూడి
గీ. యట్టి దేవి జగన్మాత యఖిలవంద్య
నిఖిలవిద్యాకళేశ్వరి నిత్యమహిమ
నొకతెయును శ్రీగళుని క్రేవ నుల్లసిల్లు
నలఘుకల్యాణశుభగాత్రి యద్రిపుత్రి.

(నిశ్శంకుని కొమ్మయ – వీరమాహేశ్వరము)



ఉ. ఆదిమశక్తి యీతరుణి యాద్యకుటుంబిని యీకుమారి ము
త్తైదువ యీతలోదరి చిదాత్మక యీసతి విశ్వమాత యీ
పైదలి సర్వలోక గురుభామిని యీ చపలాక్షి యంచు బ్ర
హ్మాదులు వచ్చి నిచ్చలు హిమాద్రికి ని న్నెఱిఁగింతు రంబికా!

(త్రిపురాంతకుఁడు – అంబికాశతకము)