పుట:ఉదాహరణపద్యములు.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శివస్తుతి 11

గీ. మూడు లోకంబులును గాద మొరసినట్లు
చేతముమ్మొన కైదువు (చెన్నుమీఱ)
వేల్పుఁబదువుచూడ్కికిం గడువింతవేడ్క
సేసె ముక్కంటియున్న యా చెలువుపెంపు

(ప్రబంధపరమేశ్వరుని హరివంశము ఉత్తరఖండము 6.38)



సీ. తమ్ముల బెదరించిఁ దళుకువెన్నెలసోగ
కన్నె గేఁదగిఱేఁకు గారవింపఁ
బదినూఱు పడగలఁ బఱపైన పదకంబు
సవడి ముత్యపుబన్ననరముఁ బ్రోవ
మిసమిసమనమించు భసితాంగరాగంబు
వరఁగుజందనచర్చఁ బరిఢవింప
మెఱయు మువ్వన్నె లమరుపుట్టముకొంగు
చెఱఁగులునునుబట్టు చేలఁ బెనుప
గీ. మించి తలమీఁద నురువుపై మేనఁగట్టి
యీడుదోడుగ నుమతోడఁ గూడి జగము
లెల్ల రక్షించు నిను భజియింతు మెపుడు
భయదదురితలతాదాత్ర ఫాలనేత్ర

(పోతరాజు వీరయ్య – త్రిపురవిజయము)



శివతాండవము:
మ. కరఢక్కారవవాద్య మింపొదవ గంగాతుంగరంగత్తరం
గరవప్రస్ఫుటతాళసమ్మిళితతత్కంజాతపుంజస్ఫుర
ద్వరపుష్పంధయమంథరధ్వనులు గీతంబొప్పఁ దౌర్యత్రికం
బిరవైయుండఁగ నీదు తాండవమునం దేపారు సర్వేశ్వరా!

(జైతరాజు ముమ్మయ – విష్ణుకథానిధానము)