పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మదనారాధనము


సీ. ఎండ క న్నెఱుఁగని యెలమావిమోఁకల
నడుమఁ జెన్నొందు పున్నాగవిటపి
క్రిందఁ జల్లనినీడఁ గెందలిరాకులఁ
జేసిన చారుసింహాసనమున
రతిదేవితో వలరాజు నామంత్రించి
యొప్పు నంభోజకుంభోదకముల
నభిషేక మొనరించి యందంద కడివోని
పూవుటెత్తులఁ జాలఁ బూజసేసి
తే. మొకరితుమ్మెదచే మూఁతి ముట్టఁబడని
విరులఁ గమ్మనితేనె నైవేద్య మిచ్చి
ముదిత లెల్లరు సాగిలిఁ మ్రొక్కి లేచి
మోడ్పుఁజేతులు ఫాలముల్ మోపి నిలిచి. 58

చ. మనసిజ పంచబాణ యసమానపరాక్రమ నీదు విక్రమం
బనుపమ మంతకాంతకుని యంతటివాఁడును బారుపంతమై
నిను ననిఁ దెంపుమైఁ గదియనేరక నేఁడును నీళ్ళుమోవఁగా
జను లొక లక్ష్యమా కుసుమసాయక నీపటుబాణశక్తికిన్. 59

సీ. వనజాతభవు నంతవాఁడును నీయాజ్ఞ
కేమని చెప్ప నోరెత్తవెఱచుఁ
గనువిచ్చి నిను నాజిఁ గనుఁగొను నంతనే
మృత్యుంజయుని తలమీఁద వచ్చె
మదికి వ్రేఁగై యుండు మధుకైటభారికి
వర్ణింప భవదీయవర్తనంబు
వేయేల పొగడ నీవిభవ మింద్రునియంత
వానిఁ జేసితి డాఁగువానిఁ గాఁగ
తే. మఱియుఁ బెక్కులు గలవు నీమహిమ లెన్న
నిట్టి నీపెంపుఁ గొనియాడ నెవ్వఁ డోపు
నాత్మ మాచేయు నర్చన నాదరించి
వఱలుకృపఁ జూడుమా చంద్రవదన మదన. 60