పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సీ. మదన మా రాకేందువదన కుంతలములు
భ్రమరంబులకు బ్రోచు[1] బలగ మౌట
గుసుమాస్త్ర మా నీలకుంతల కంఠంబు
కలకంఠముల కేడుగడయు నగుటఁ
గందర్ప మా గంధగజయాన పలుకులు
శుకరాజికినిఁ గూర్మిచుట్ట లగుట
వలరాజ మా మానవతి మందగతు లంచ
బోద నెత్తురుఁబొత్తు లగుటఁ
తే. బుష్పకోదండ మా పూవుఁబోఁడి బొమ్మ
లయ్య నీతియ్యసింగిణి కనుఁగు లగుటఁ
దలఁచి దయతోడఁ జూడు మా తలిరుఁబోఁడి
నింతి నీమన్ననకుఁ బాత్ర మెన్నియెడల. 61
 
సీ. బలభేది గౌతముభార్యకై నడురేయిఁ
గోడిఁ గావించిన ప్రోడతనము
కుముదబాంధవునకు గురుకళత్రంబుపైఁ
గనుమరుల్ గొలిపిన కలికితనము
మధువైరి నాభీరమానినీమణులకై
జారుఁ జేసిన యట్టి జాణతనము
కమలగర్భునకును గారాపుఁగూఁతుపై
వలపునించిన ప్రౌఢవర్తనంబు
తే. శక్తి నెయ్యంపుసుతుఁ బరాశరుని దాశ
నందనకు జాలిగొలిపిన నైపుణియును
నీక కా కెవ్వరికిఁ గల్గు లోకములను
వినుత గంధర్వ గీర్వాణ విషమబాణ. 62

ఉ. ధారుణి తేరు మేరుగిరి ధర్మమహీంద్రుఁడు నారి బాణ మం
భోరుహనాభుఁ డయ్యుఁ బురముల్ గుఱి మూఁడఁట రాజమౌళికిం
దేరు శుకంబు వి ల్చెఱకు తేఁటి గుణం బల రంపకోల నీ
కారయ ముజ్జగంబు గుఱి హా హరుఁ డె ట్లెన నీకు మన్మథా. 63



  1. మోచు