పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తే. దనియ బరువైన పారిజాతముల నీడఁ
బొదలియాడెడు నెడ కేకిపోతకంబు[1]
నంతకంతకు నగ్గలం బగుచు వచ్చు
వేడ్కఁ దేలించె నమ్మహీవిభు మనంబు. 134
 
చ. అలితతి నీలముల్ ముదురుటాకులు పచ్చలు లేఁజిగుళ్ళు కెం
పులు దళరాజి వజ్రచయముల్ కలికావళు లాణిముత్తియం
బులుగఁ బొసంగు చంగజుని బొక్కసమో యన[2] నాత్మలోన నిం
పులు పొదలించె రాజునకుఁ బూచి బెడంగగు పొన్న లున్నతిన్. 135
 
చ. జలధులనీరు ద్రావునెడ సారెకు నీరునఁ గూడి వచ్చు కెం
పులు నునుగెంపు బిందియలఁ[3] బోసి దృఢంబుగఁ బక్వదాడిమీ
ఫలముల పేర నిల్పి బహుభంగులఁ గావలులున్న వారిదం[4]
బులొ యనఁ జూడ్కి కింపొసఁగఁ బొల్పగు దోహదధూపధూమముల్. 136
 
ఉ.గుత్తపుఁ జన్నుదోయి పువుగుత్తులు చేతులు పల్లవంబు లు
ద్యత్తరవాసనల్[5] విరులతావులు మోవులు తేనియల్ కురుల్
మత్తమధువ్రతంబులయి మానుగ రాజిలు తీవ లోలి భూ[6]
పోత్తమునాత్మ కింపొసఁగె నొక్కట నవ్వనలక్ష్ములో యనన్. 137
 
ఉ. పూవులతేనియన్ మధుపపోతములన్ జిగురాకుమేఁతలం
గోవ పికవ్రజంబులను గ్రొత్తఫలంబులఁ గల్కిచిల్కలం
జేవదలిర్ప మన్పుచును జేరికలం దని గాలి నిల్పుచున్
భావజునీడలై పొదలు ప్రాయపుమావు లొనర్చె నింపులన్.[7] 138



  1. యడకెక్కి పోదకంబు
  2. లాఁడిముత్తియంబులుగ హసంగు చంగజుని బొక్కస మెల్లన
  3. వచకిం పులుకున కెంపు బింటియల
  4. గానళులన్ను వాలిదం
  5. ద్యత్తరువాసకముల్
  6. లోవి భూ
  7. పూవులతేనియల్ మధుపపోతములున్ పికురాకు మేతలున్; గోవపికవ్రజంబులును గ్రొత్తఫలంబులు గల్గి నిల్కలున్; జేవదలేక మన్పుచును చేవికలన్ దనుగాని నిల్పుచున్; భావజుని డండై పొదలు ప్రాయపు మాపు లొనర్చె నింపులన్.