పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉ. సారెకుసారె కామ్రతరుశాఖలఁ బ్రాకి తనర్చు మాధవీ
వీరుధు లర్థిఁ జేరువుల వెల్వడు భూవరు మీదఁ గ్రొవ్విరుల్
బోరన రాల్చు టొప్పె నళిపోత గరుత్ప్రవిచాలనంబులం
గోరి వనాంతలక్ష్మి యొసగుం గుసుమాంజలి చంద మందమై. 139

గీ. ఈడ పండుల[1] సామగ్రి యీడఁదక్క
నొండు వనముల లేవు సుండో యటన్న
యట్లు పికరాజి పెంగూఁక లాడుచుండఁ
బొల్చునీడలఁ జూచు నాభూవిభుండు. 140
 
గీ. అక్కఱకుఁ బూవు లొదవని యపుడు చెలుల
చేతఁ దన్నింప మరుని దాసియును బోలెఁ[2]
గరము రాజిల్లుచుండు నీతరు వటంచు
నగుచుఁ గంకేలిఁ జూచె భూనాయకుండు. 141
 
సీ. ఆరఁబండిన క్రొత్తయల్లొనేరెడుపండ్లు
కుంతలంబుల యొప్పు సంతరింపఁ
గమియఁబండిన పెద్దగజనిమ్మపండులు
పాలిండ్ల చెలువంబు ప్రస్తరింప
ముదురఁబండిన మంచిమాతులుంగపుఁబండు
లంగంబు కాంతి చె న్నవధరింపఁ
దనియఁబండిన తీయద్రాక్షాఫలంబులు
కలికివాతెఱ సోయగంబునాఁగఁ
తే. బలుచఁ బాఱిన లతవికాపల్లవములు
గండసాళుల విభవంబు గమ్మిరింపఁ[3]
బొలుచు వనలక్ష్మి యవయవంబులునుబోని
వనవిశేషంబు వీక్షించె మనుజవిభుఁడు. 142



  1. ఈడపండ్లు
  2. పురుడుని దానియునుబోలె
  3. గమ్మురింప