పుట:ఉత్తరహరివంశము.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28

ఉత్తరహరివంశము


జెమటలఁ బత్త్రభంగములు చిందఱవందఱ లైనఁ దోన సం
భ్రమమున వీరలక్ష్మి సమరక్రమరక్షకు వ్రాసెనో యనన్.

159


శా.

సత్త్రాజిత్తనయాకరాంతరధనుర్జ్యారావ మైరావతీ
సూత్రానర్గళనిర్గతస్తనితమై సుత్రామచాపప్రభా
పాత్రభ్రూలతికావిలాసముల కొప్పం గప్పు శార్ఙ్గాంబుము
క్పత్రిక్రూరమహాశనుల్ దనుజరాడ్గాత్రంబు గోత్రంబుగన్.

160


సీ.

తంత్రీవినోదంబు తడవు సైపనివ్రేళ్ళ
                 గొనయంబు తెగలపైఁ గోరుకొనుట
యద్దంబుపిడి ముట్ట నలయు పాణితలంబు
                 లస్తకం బిఱియించు లావుకలిమి
చెలికత్తె నౌత్తిలి చీర లేనియెలుంగు
                 సింహనాదంబుచేఁ జెదర కునికి
ప్రమదనర్తనకేలిఁ బరిఢవింపని పదం
                 బై దుఠాణంబుల నలఁతఁ బడమి


తే.

సోయగపుఁజిత్రరూపంబుఁ జూచుచోట
వేసరువిలోచనంబులు వికృతదైత్య
లక్ష్య మీక్షించుటయు మొక్కలం[1]పుగెలుపు
గైకొనియె సత్యభామ సంగ్రామసీమ.

161


మ.

అరిఁ జూచున్ హరిఁ జూచుఁ జూచుకములం దందంద మందారకే
సరమాలామకరంద[2]బిందుసలిలస్యందంబు లందంబు లై
తొరుగం బయ్యెదకొం గొకింత దొలఁగం దోడ్తో శరాసారమున్
దరహాసామృతపూరముం కురియుచుం దన్వంగి కేళీగతిన్.

162


ఉ.

ఊచనకట్ట వంపని పయోరుహలోచన మింట మంటలం
బూఁచిన బాణజాలమునఁ బూర్వసుపర్వపురాణగర్వమున్
వేఁచినచందమున్ విపులవీరరసంబున నాత్మచిత్తముం
దోఁచిన చందముం దెలియఁ దోఁచిన నచ్చర లిచ్చ మెచ్చరే.

163
  1. పుఁదెంపు (బుఁ దెలుప)
  2. ఘర్మ