పుట:ఉత్తరహరివంశము.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

162

ఉత్తరహరివంశము


చ.

అనుచు విలాపనాలసత నాయమునానదీతీరభూమికిం
జని హరిఁ గాంచి యోరి పురశాసనశిష్యుని హంసుఁ గానవే
యనుటయు వాఁడె పో యమునయందు మునింగె ననంగ వెండియున్
మునుఁగుచుఁ దేలుచున్ డిభకమూఢుఁడు హంసునిఁ గానఁ డయ్యెడన్.

301


క.

వ్రేలెడు వెండ్రుక లిరుగడఁ
దూలఁగఁ దలయూఁచుఁ దొప్పుదొప్పున నోరుం
గేల నడిచికొను సెలవుల
లాలలు దొరుఁగంగ నన్నలా! యని యొఱలున్.

302


క.

ఱాలం దల యడిచికొనున్
నేలం బడి పొరలు లేచు నెత్తురు లుమియుం
గేలిఁ బడి రిపులు చూడఁగ
నాలుక వెఱికికొనుఁ జావునకుఁ దన్నికొనున్.

303


వ.

ఇట్లు దుర్మరణంబున హంసడిభకులు వెలిసిరి తదనంతరంబ గోవిందుండు
గోవర్ధనాచలంబున బలభద్రసాత్యకిప్రభృతియాదవలోకంబుతోఁ గొంతవడి వినో
దించు నవసరంబున.

304

యశోదయు నందుఁడును గృష్ణునిఁ జూడవచ్చుట

శా.

గోపాలాగ్రణి రేవతీరమణుతో గోవర్ధనాధిత్యకా
వ్యాపారుం డయినాఁ డనంగ విని భావంబేతదాలోకచిం
తాపూర్ణంబుగ నందగోపుఁడు యశోదాదేవియు న్వచ్చి భృ
త్యోపానీతము లైనకానుకలు దా రొప్పించి రేర్పాటుతోన్.

305


క.

ఇతరేతరసందర్శన
కృతాభివాదనుల రామకృష్ణులఁ బ్రీతిన్
సతియును బతియుం జూచిరి
సుతులుం బితృభక్తి నెఱయఁ జూచిరి వారిన్.

306


వ.

అప్పు డామురాంతకుండు నందగోపునితో నిట్లనియె.

307