పుట:ఉత్తరహరివంశము.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

105


బై మంటలు మింట నంట వెడలి కడలి వెడలిన బడబానలకీలాకలాపంబు
చందంబునం గాలకూటవిషవహ్నిజ్వాలామాలికాభీలం బై నీలకంఠనిటల
తటనయనశిఖశిఖాసహాయం బైన తెఱంగున మెఱచి చఱచినం బురంబు సొర
నేరక కృత్య కృత్యంబు లేక మరలి పఱవం జొచ్చిన విచ్చలవిడి దనమయం
బుగ గగనంబున నిగుడు నచ్చక్రంబుం గనుంగొని.

144


క.

సురగరుడయక్షవిద్యా
ధరకిన్నరదివ్యమునులు తద్దర్శనసం
స్మరణప్రణామపూజా
పరతంత్రతఁ దెరువు దొలఁగి బలసిరి చదలన్.

145


క.

పురుహూతముఖ్యదిక్పా
లురును సేవింపంగ సకలలోకేశ్వరుఁ డం
బురుహాసనుఁడు గని నమ
స్కరించి వినుతించె నిజముఁ గైవారముగాన్.

148


సీ.

రైతేయమదవతీధమ్మిల్లములతోడ
                 విరులనెత్తావికి వీడుకోలు
దనుజశుద్ధాంతకాంతాకటాక్షములతోఁ
                 గలికికాటుకలకుఁ గానివావి
దానవమానినీస్తనకుంభములతోడఁ
                 బసుపుఁబయ్యెదలకుఁ బాయు తెరువు
దైత్యావరోధనదయితాధరములతో
                 సొబగువీడెములకుఁ జుక్క యెదురు


తే.

చేసి సురసుందరీకరోశీరతాల
వృంతచలితాంతకుంతలవిలసదింద్ర
కులవధూటీలలాటికాకుంకుమంబుఁ
బదిలపఱుపఁ జక్రంబ నీభరమ కాదె.

147


వ.

అనుచుం జక్రంబు వీడుకొని కడచి పోవుటయు నాసుదర్శనంబు
నుద్దేశించి.

148