పుట:ఉత్తరహరివంశము.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

95


జటులపరాక్రమం బనుచుఁ జయ్యన జేరి మురారి యొత్తెలె ను
ద్భటకుటిలారిహృత్పుటవిపాటనధన్యముఁ బాంచజన్యమున్.

89


క.

ఆ నినదము విని యాదవ
సేనలు పొంగారె నెదురు సేసలు సల్లెన్
మానవపతితతి వందిజ
వానూనస్తుతులు చెలఁగె నచ్యుతు మ్రోలన్.

90


చ.

గరుడుని డిగ్గి వీడ్కొలిపి కంసవిరోధి పురంబులోపలం
దిరపడి దారుకుల లనిచి తే రలవాటుగఁ దేర నెక్కి సం
గరకుతుకంబుతో వెడలి గర్వితులెల్లను దల్లడిల్ల ని
ష్ఠురరపాండజన్యుఁడగు[1]చున్ నిగుడన్ గని పౌండ్రుఁ డత్తఱిన్.

91


క.

శినిమనుమడు నిలు నిలు మని
వెనువెంటం దవిలి రాజవే నీవు ననుం
జెనకి యపకారితనమునఁ
జన వచ్చునె యనుడు శౌరి సాత్యకి కనియెన్.

92


మ.

రణసంరంభము మాన్ప నేమిటికనా రానిమ్ము రానిమ్ము నా
రణగర్వంబు మృగేంద్రసంచరణపర్యంతంబ నీగాలికిం
దృణ మీతం డనుచు న్నిజానుజునిఁ బ్రీతిం దేల్చినం బౌండ్రుఁ డు
ల్బణరోషంబున వాసుదేవునకు నుల్లాసంబుతో నిట్లనున్.

93


ఉ.

నీవును వాసుదేవుఁడవు నిక్కమ యేనును వాసుదేవుఁడం
బో వినువారి కైన నిది వోలునె యింతటనుండి ధాత్రిలో
గోవులఁ గాచి గాడిదల గొడ్డులఁ బోతులఁ జంపిరేని నే
జీవుల వాసు దేవుఁ డనఁ జెల్లునె లావునఁ బేరు సెల్లునే.

94


క.

నాకును గద నీకును గద
నాకును నందకము నీకు నందక మహహా
నాకును జక్రము చక్రము
నీకును విలు నాకు విల్లు నీకుం దగునే.

95
  1. డున్ నిగిడెన్