పుట:ఉత్తరహరివంశము.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

68

ఉత్తరహరివంశము


తే.

గనియెఁ జిత్రంబులకు వీరు గలసియుండి
మనుపఁ జెఱుపంగఁ జెఱుపంగ మనుప నేర్తు
రెల్లలోకంబులకు దైవ మేక మగుట
హరిహరాత్మక మెఱిఁగితి మనిరి సురలు.

181

శివుఁడు సాక్షాత్కరించి కృష్ణునకుఁ బుత్త్రు నొసంగుట

చ.

ప్రమథులు సప్తమాతృకలుఁ బార్వతియు న్మురవైరి తాపసో
త్తములు నుతింప నయ్యెడ సుధాకరఖండవతంసుఁ డిట్లనున్
దమతమలోనిచూడ్కిఁ దముఁ దార కనుంగొనుమాడ్కి నింతగా
లము నినునీవ చూచి[1]తి తలంపున నీవును నేన కావునన్.

182


మ.

యదువంశాంబుధిచంద్ర! నీమదిఁ గుమారాపేక్ష నాలో నెఱుం
గుదు నాకీ చన వీఁ దలంచియ తపోఘోరక్రియ న్మెచ్చఁగాఁ
బిదపం జెప్పెడివాఁడవై తగుఁ దగున్ బృందారకశ్రేణికిన్
హృదయాహ్లాదముగా మదీయమకుటం బెక్కెన్ భవత్పాదముల్.

183


క.

నీ కొడుకు నీకు నిచ్చితిఁ
గైకొనుము విరించిచిట్టకాలకు లోనై
నాకుఁ బగ యగుట నంగము
లేకున్నాఁ డతఁడు కొఱత లే దతనిపయిన్.

184


వ.

అది యె ట్లనిన వినుము.

185


మ.

హిమవత్కూటమునన్ దపోమహిమతో నే నున్ననాఁ డమ్మహీ
ధ్రము నాకుం దనకన్యం జూపి పరిచర్యాకారిణిం జేసినన్
రమణీరత్నము నన్ను సంతతము నారాధించె సద్భక్తిసం
భ్రమభావంబులు విభ్రమభ్రమణవిభ్రాంతిం దొలంగింపఁగన్.

186


ఉ.

అత్తఱిఁ దారకుం డనుమహాసురుఁ డీసురసంఘము న్మదో
న్మత్తవిహారుఁ డై గెలిచి నాకము చూఱగొనంగ వాసవుం
డెత్తినభీతి బ్రహ్మకడ కేఁగి ప్రణామము చేసి ఖేదముం
దత్తఱపాటుఁ జెప్పిన విధాతృఁడు నాతనితోడ నిట్లనున్.

187
  1. తె తలంచిన