పుట:ఆముక్తమాల్యద.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

కొలువై బహునమయంబుల
మెలఁగెడు కోవిదులఁ గూర్చి 'మీ మీ శాస్త్రం
బులలో నెవ్వఁడు మోక్షం
బెలయించునొ చూచి నిశ్చయింపుఁ' డటంచున్.

84


తే.

వాద మొనరించి గెలిచి తత్త్వంబు దెలుపు
వాని కని బీరపువ్వులఁ బోని టంక
సాలవాటులు నించి యాస్థానిఁ గట్టఁ
గాలసర్పముగతి వ్రేలుజాలెఁ జూచి.

85


క.

హరు నొకఁ డన, నుమ నొకఁ డన
హరి నొకఁ డన, శిఖి నొకఁ డన, నర్కు నొకఁ డనన్,
గరిముఖు నొకఁ డన, రజనీ
శ్వరు నొకఁ డన, నజు నొకఁ డన, వాదైనతఱిన్.

86


తే.

విల్లిపుత్తూరిలో నల్ల విష్ణుచిత్తుఁ
డతులతులసీసుగంధిమాల్యమును మూల
మంత్రమున నక్కుఁ సేర్పఁబో మన్ననా రు
దారమధురోక్తి నవ్విధ మానతిచ్చి.

87


ఉ.

నేఁడు మహామతీ! మథుర నీవు రయంబునఁ జొచ్చి యందుఁ బాం
డీఁడు దివాణము న్నెఱయ నించినఁ బ్రేలెడు దుర్మదాంధులన్
బోఁడిమి మాన్చి మన్మహిమముం బ్రకటించి హరింపు శుల్కమున్
వాఁడును రోసినాఁ డిహము వైష్ణవుఁగా నొనరింపు సత్కృపన్.

88


తే.

అనిన వడవడ వడఁకి సాష్టాంగ మెఱఁగి
సమ్మదాశ్రులు పులకలు ముమ్మరింప
వినయవినమితగాత్రుఁడై విప్రవరుఁడు
వెన్నునకు భక్తి నిట్లని విన్నవించె.

89


శా.

స్వామీ! నన్ను నితఃపురాపఠితశాస్త్రగ్రంథజాత్యంధు, నా
రామక్ష్మాఖననక్రియాఖరఖనిత్రగ్రాహితోద్యత్కిణ
స్తోమాస్నిగ్ధకరున్, భవద్భవనదాసు, న్వాదిఁగాఁ బంపుచో
భూమీభృత్సభ నోట మైన నయశంబు ల్మీకుఁ గాకుండునే?

90