పుట:ఆముక్తమాల్యద.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

విని, తద్గ్రంథార్థము నె
మ్మనమున నూహించి, తెలిసి, మ్రాన్పడి, కడకుం
దన మోసమునకు భయపడి,
జనపతి యటు చనక నిలిచి, సంతాపమునన్.

77


ఉ.

ఎక్కడి రాజ్యవైభవము? లెక్కడి భోగము? లేటి సంభ్రమం?
బక్కట! బుద్బుదప్రతిమమైన శరీరము నమ్మి మోక్షపుం
జక్కి గణింపకుంటి; యుగసంధుల నిల్చియు గాలుచేతి బల్
త్రొక్కుల నమ్మనుప్రభృతులున్ దుద రూపఱకుండ నేర్చిరే?

78


క.

ఉన్నట్ల యుండ నద్దరి
కి న్నరులను నావ చేర్చు క్రియ వెసఁ దా బో
కున్నట్ల యుండి కాలం
బు న్నరులకు వయసు బుచ్చి మోసము దెచ్చున్.

79


చ.

సగరు, నలుం, బురూరవుఁ, ద్రిశంకుసుతున్, బురుకుత్సుఁ, గార్తవీ
ర్యు, గయుఁ, బృథుం, భగీరథు, సుహోత్రు, శిబిం, భరతుం, దిలీపునిన్,
భృగుకులు, యౌవనాశ్వు, శశిబిందు, ననంగుని, నంబరీషుఁ, బూ
రుగురుని, రంతి, రాఘవు, మరుత్తునిఁ గాలము కోలుపుచ్చదే?

80


క.

కానఁ దటిచ్చల మగు రా
జ్యానందము మరగి యింద్రియారాముఁడ నై
పో; వింతనుండి పరలో
కానందంబునకె యత్న మాపాదింతున్.

81


క.

వర్గత్రయపరత ముహు
స్స్వర్గక్ష్మామధ్యమాధ్వజఙ్ఘాలికతా
దుర్గతియు నొల్ల, మఱి యప
వర్గదుఁ డేవే ల్పెఱింగి వాని భజింతున్.

82


క.

అని తలఁచి మెచ్చి, యవ్వి
పునకు న్వీటికరండమున ముద్రిత మై
యునిచిన యొక ముడు పార
క్షునిచే నిప్పించి, నగరు సొచ్చి, చనన్.

83