పుట:ఆముక్తమాల్యద.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.

గృహసమ్మార్జనమో, జలాహరణమో, శృంగారపల్యంకికా
వహనంబో, వనమాలికాకరణమో, వాల్లభ్యలభ్యధ్వజ
గ్రహణంబో, వ్యజనాతపత్రధృతియో, ద్రాగ్దీపికారోపమో,
నృహరీ వాదము లేల? లేరె యితరు ల్నీ లీలకుం బాత్రముల్?

91

మన్ననారు విష్ణుచిత్తు ననుగ్రహించుట

తే.

అనినఁ దద్భక్తి కెద మెచ్చి యచ్యుతుండు
మొలకనగ వొప్ప శ్రీదేవి మోము సూచి
'వా దితనిచేనె గెలిపింతు; నాదుమహిమ
మువిద కను' మని ప్రాభవం బొప్పఁ బలికి.

92


క.

నీయిచ్చయె? మిన్నక పో
వోయి, మునిప్రవర! నిన్ను నొప్పింతును భూ
నాయకసభ, నిందులకై
యేయడ్డము వలవ దవల నే నున్నాఁడన్.

93

విష్ణుచిత్తుఁడు మథుర కేఁగుట

క.

ఆనతిఁ బడి, శ్రీభండా
రాన న్సంబడముఁ దనదు ప్రాఁతందలమున్
స్థానికుఁ డొసంగి పనుపం
గా, నానతిబడిన నిమితకాండ్రు వహింపన్.

94


క.

లావు గల యద్దెగుఱ్ఱపుఁ
జావడములమీఁద మాత్రసంచులు దూలన్,
గ్రేవల నేకాంగులు రా,
వీవధముల నఱిసె లవనివిభునకుఁ గొనుచున్.

95