పుట:ఆముక్తమాల్యద.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

క్షేత్రపాలున కుదికినచీర లాఱు
చాకిరేవుల గము లయ్యె సకలదిశలుఁ
దెలుపులుగఁ దోఁచు నెండమావుల బయళ్ళఁ
గందె నివి యెండ నన దిఙ్ముఖములు రాఁజె.

46


చ.

సరి యగు నిట్టివెట్ట నివి సర్వము నం చటమీఁదిసృష్టికై
శరధిపదిఙ్మరుజ్జ్వలితచండతరాతపవహ్నిఁ గాలఁగాఁ
గరువు లజుండు వీనిపయిఁ గట్టె ననన్ గనుపట్టె వెచ్చల
న్గరి కిరి కాసరాంగములఁ గప్పిన ఱొంపులు నంద యాఱఁగన్.

47


మ.

దవధూమంపుఁదమంబులోఁ దమరసద్రవ్యంబుఁ బంకేజబాం
ధవభానుప్రతతుల్ హరింపఁ గుయివెంట న్వెళ్లు శూన్యోరుకూ
పవితానం బనఁ జూడఁజూడఁ బుడమిన్‌ బాటిల్లి పై విప్పులై
యవసం బంచుల నాడఁగా నెగసె వాత్యాళి న్రజశ్చక్రముల్.

48


చ.

పడమర వెట్టు నయ్యుడుకుప్రాశన మొల్లక కూటిపేదలై
బడలిక నూడు నచ్చిలువ ప్రగ్గములన్‌ రవియాజ్ఞ మాటికిన్‌
ముడియిడఁ బిచ్చుగుంటు రథము న్నిలుపన్‌ పయనంబు సాగమిన్‌
జడను వహించె నాఁగ దివసంబులు దీర్ఘము లయ్యె నత్తఱిన్‌.

49


క.

తరణిఖరకిరణశిఖి జగ
మెరియింపఁగఁ బొడమి గాలి నెగసిన భసితో
త్కర మనఁగ శాల్మలీతరు
పరిణతఫలతూల మర్కపథమున నెరసెన్.

50


చ.

భరితనిజాంబుబింబితవిభాకరబింబవిజృంభితప్రభాం
కురముల నధ్వనీనకృతకూపకపంక్తులు వొల్చె నబ్ధిరా
డ్విరహభరంబున న్బొడమువెచ్చకు శాంతి యొనర్ప వాహినీ
తరుణులు మేన దట్టముగఁ దాల్చిన ముత్తెపుఁబేరులో యనన్.

51


మ.

అతివృష్టిన్ మును వార్ధిఁ గూర్చు నెడకాఁ డౌటం దమిం గూర్చునన్
మతి లంచంబుగ హేమటంకములు మింటం బొల్చు పర్జన్యదే
వత కీ నెత్తిన కేలనాఁ బొలిచె నిర్వారిస్రవంతిన్ బయ
శ్చ్యుతి నమ్రచ్ఛదదృశ్యకర్ణికములై యున్నాళనాళీకముల్.

52