పుట:ఆముక్తమాల్యద.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

నులివాడునాఁచువల్లుల గొం తొగర్చి లేఁ
                   బొల పల్చుగాలి వే పోక నెఱిఁగి,
కడకు వెళ్ళఁగ నొక్కకడనుండి త్రొక్కుచు
                   నులుచలుఁ జిఱుతగుల్లల నమలుచు,
నెండ్రి కా లిఱికిన నెగసి యొక్కించుక
                   తొలఁగి శితత్రోటిఁ దూఁటి తినుచుఁ,
దడి యింకునిలఁ జేమమడివోని తమ్మిగుం
                   పులును జీలుగుల నెండలు గడపుచు


తే.

దనరు బకపంక్తులకు జానుదఘ్న మయ్యెఁ
జెరువుగమి; యుడుము లన రే ల్దిరిగెఁ గుక్క
పసికి బావులఁ బడుటకు బసులయెరువు
టెఱలకు మొసళ్లు; మలుఁగుమీ న్బొఱియఁ దూఱె.

53


ఉ.

మీ టగు మీలనెల్ల మును మ్రింగి క్రమంబున నానె నెండ పె
న్నీటిక వెంటఁ దోఁచుతొగవేరుబడి న్గొడుపై చెలంగఁగా
ద్రోటికఁ గర్దమద్రవముతో నెనయించిన బొమ్మిడాయ డా
త్కూటకులంపులేజెన బకోటకులంబు జలహ్రదంబులన్.

54


శా.

ప్రాతర్వేళల నట్టివెట్ట సొగసై పాటిల్లెఁ గుంభోంభనో
ద్భూతాంబుధ్వని వాద్యమై మరుదధఃపుంజీభవత్పాటల
వ్రాతామ్రేడితసిక్తభూసురభిళారామాంబుకుల్యాబహు
స్రోతస్సంధుల నంధుయంత్రనతికృత్ప్రోద్గీతగేయౌఘముల్.

55


తే.

మెండుమీఱిన పగటి బీఱెండ దాఁకి
యొల్లఁబోయిన లేబొండుమల్లెపొదల
తుదలఁ జప్పటలై కడుదొడ్డ లగుచుఁ
బొడమె మొగ్గలగము లగ్గిబొబ్బలట్ల.

56


మ.

నుడి నాభిచ్ఛలన, న్సరోజములు చక్షుఃప్రక్రియ, న్నాఁచు క్రొ
మ్ముడి దంభంబునఁ, జక్రఫేనపటలంబు ల్చన్నులు న్నవ్వుఁగా,
నడరంజేసి నిదాఘభీతి సలిలం బాగామిబీజార్థ మై
కడనం బెట్టిన వారిదేవతలు నాఁ గాంతాళి యొప్పు న్స్రపన్.

57