పుట:ఆముక్తమాల్యద.pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

లలనచే నిష్ఠతో లాజలు వేల్పించి
                   శార్ఙ్గి మెట్టించెను సప్తపదులు
తెఱవఁ గూడి యరుంధతీదర్శనముఁ జేసె
                   బ్రహ్మరుద్రాది గీర్వాణకోటి
యర్పించు నుడుగుర లనుకంపఁ గైకొని
                   యనిచెఁ బ్రసాదభాజనుల జేసి
[1]యాత్మపట్టణమున కతివఁదోడ్కొని విజ
                   యంబు సేసెను మహాహర్ష మొప్ప


తే.

సహ్యకన్యాతటోద్యానచందనద్రు
కుంజముల నీలకుంతలఁ గుస్తరించి
కంతుసామ్రాజ్య మేలించి కరుణఁ జిత్త
మొలయ జగములఁ బాలించుచున్నవాఁడు.

71


ఉ.

స్కందసరస్తటీరమణ కందర చందన కుందవాటికా
మందసమీరలోల వనమాలిక! నిర్మలదివ్యవిగ్రహా
స్పందివిభాధరీకృత నభస్స్ఫుటకాళిక! వల్లవాంగనా
బృందమనోభిమాన ధృతి భేదన! పేశలవంశవాదనా!

72


క.

అరిధారాఖండిత మరు దరిసంఘ, విహంగవాహనా, యుదరమహాం
బురుహ పుటభరిత మధుశం, బర భర జలమానుషాయమాణద్రుహిణా.

73


స్రగ్విణి.

వాలినిర్భేదనా! వారిజాతేక్షణా!
శైలకన్యాస్తుతా! శార్ఙ్గ చంచద్భుజా!
ఫాలద్రుక్పద్మభూపాకభేదిస్ఫుర
న్మౌళిమాణిక్యరుఙ్మండితాంఘ్రిద్వయా!

74


మ.

ఇది నీలాచల నీలచేలక సుభద్రేందీవరాభాక్షి కో
ణ దృగంచత్‌ భుజ వీర్య ధుర్య జయ సన్నాహార్భటీ వాద్య భీ
త్యుదితేభేశ్వర కృష్ణరాయ మహిజా న్యుత్పాదితాముక్తమా
ల్యద నాశ్వాసము సప్తమంబలరు హృద్యంబైన పద్యంబులన్‌.

75


సంపూర్ణము

శ్రీకృష్ణార్పణమస్తు

ఓం తత్ సత్

  1. యాత్మపట్టణమున కతివైభవంబున / నతివఁదోడ్కొని విజయంబుచేసి