పుట:ఆముక్తమాల్యద.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బ్రకృతికాంత క్రంత సురకాంతలం గూడుకొని సంతరింప, హుతవహుం
డగరుధూపంబు రేఁపఁ, బర్జన్యుం డుల్లెడయిడఁ, బ్రాచీనపాఠంబులు పాఠ
కౌఘంబులయి బిరుదప్రబంధంబులు పఠియింప, విధినందనసనందనాదులు
సంగీతమాంగల్యంబున నంతరంగంబున కింపొసంగ, విహంగవుంగవుండు
మత్తమాతంగంబై ఖచితమణికల్యాణం బగు పల్యాణం బంగీకరింప,
నప్రాకృతవైభవంబునం జని, పరమసంభ్రమంబున భాగవతవతంసంబు
భక్తికలితబహుప్రణామపూర్వకంబుగా నెదుర్కొన నెక్కిరింత డిగ్గి విష్వ
క్సేను కరం బవలంబించి కక్ష్యాంతరంబులం జంచలాక్షులు గడుగు నడుగుల
జలంబులకుం బయిపయిం బడి గీర్వాణసిద్ధసంఘంబు లహంపూర్వి నుర్వి
నిఠ్వారిగా నూర్చికొని ప్రాశింపఁ బ్రవేశించి తదీయనిర్దిష్టం బగు జాంబూనద
పీఠంబున నుపవిష్టుండై యతండు వెండియు బంగారభృంగారుకంబులఁ గనక
భాజననిక్షిప్తంబు లగు కుశేశయపేశలపదకిసలయంబులు గడిగి షోడశోప
చారసహితంబును సపరిష్క్రియంబు నగు మధుపర్కంబు నొసంగం
గొని యయ్యాళ్వారు దేవేరియుం దానును ధారవోయ నా కన్యకారత్నంబుఁ
బరిగ్రహించె ననంతరంబ.

66


మ.

కలధౌతద్రవచిత్రము ల్మెఱయ ముక్తాన్యూత మౌ మేచకాం
చలపుం బెందెఱ వారి లగ్నము సమాసన్నంబుగా వేల్పుఁబె
ద్దలు పంపన్ గుడ జీరకంబులు సముద్యత్ప్రేమ నన్యోన్యమం
జులమస్తంబుల నుంచి రర్థిఁ గనుమించు ల్చిఱ్ఱుము ఱ్ఱాడఁగన్.

67


చ.

మణి వనమాలి చూడమున మానిని ముత్తెపుఁబ్రాలు వోయుచో
మెఱయుఁ దదంగుళీకిసల మేళనఁ జక్రి చెమర్ప రాలి మై
నఱిమఱి ఘర్మబిందువులు నమ్మణులు న్మొగిలందునుండి డా
ల్గిఱిగొన జాఱు ధారల బలె న్వడగండ్లబలె న్గనుంగొనన్.

68


తే.

ఇంతి దోయిట సేసఁబ్రా లెత్తుచోట
గుబ్బపాలిండ్లక్రేవ గ్రక్కున మురారి
కన్నువేయుటఁ గని లజ్జ గదుర బాహు
లెత్తక కరాగ్రములన పై కెగురఁజల్లె.

69


క.

గళమునఁ గట్టెను హరి మం
గళసూత్రము పులక లతివ గాత్రముఁ బొదువన్
నెలఁతయుఁ బతియును గరముల
నలవఱిచిరి కంకణంబు లన్యోన్యంబున్.

70