పుట:ఆముక్తమాల్యద.pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

అట్లు వైవాహికపుదీక్ష యమరఁ గమ్మ
నూనెఁ దలయంటి నెఱులు గందానఁ బులుమ
స్వర్ణమణికుంభహిమవారి జలక మాడి
నట్టి జగదీశ్వరికి వేల్పుటబలయోర్తు.

62


క.

తడియొత్తి నన్నవలిపం
బిడి మణిపీఠస్థయైన యింతి మెఱుఁగు పె
న్నిడుదకురు లార్చి ధూపం
బిడి తుఱుము ఘటించె నొకమృగేక్షణ నెమ్మిన్.

63


సీ.

యావకద్రవమున నరుణాంఘ్రి నఖపంక్తు
                   లభ్యక్తములు సేసె నతివయోర్తు
నయకల వ్రేళ్ళమట్టియలుఁ బిల్లాం డ్లిడి
                   పాయపట్టముఁ బెట్టెఁ బై నొకర్తు
నెఱికపట్టి పసిండి నీటివ్రాత చెఱంగు
                   వెలిపట్టు రహిఁ గట్టె వెలఁదియోర్తు
కటిసీమఁ గనకమేఖలఁ జేర్చి తారహా
                   రములు గీలించెఁ గంఠమున నోర్తు


తే.

కటకములు హస్తసరము లంగదము లంగు
ళీయకములును బాహువల్లికల వ్రేళ్ళ
నిలిపి తాటంకనాసామణుల నమర్చి
చొనిపె సీమంతవీథిఁ జేర్చుక్క యోర్తు.

64


క.

కలికి తెలిగన్నుఁగవఁ గ
జ్జలరేఖలు దీర్చి మేన సారంగమదం
బలఁది లలామక మిడి చెం
గలువలు క్రొవ్వెదకు వేఱొకర్తు ఘటించెన్.

65


వ.

ఇట్లలంకృతయై యుండ లగ్నం బాసన్నంబయ్యె నని విన్నవించుటయుఁ బన్నగ
శయనుండు మార్తండమండలంబులు పండ్రెండును దివియలై వెలుంగఁ
దారకలగుంపు జగజంపుగా శతపత్త్రశత్రుం డాతపత్త్రత యంగీకరింప,
సింధువతి సౌగంధికదళోపహారసహితంబుగా విపణిఁ గలయంపిఁ జిలికింపఁ