పుట:ఆముక్తమాల్యద.pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

పూజకులచేఁ బాదతీర్థప్రసాదపరివేష్టనంబు లిప్పించి విడిది కనిపిన గుడి వెడలి
శాంబరీతనుసంభవం బాలకిం బెట్టి గృహంబునకుం జని పంజరంబు సడలించి
యచ్చంచలాక్షిం గానక.

43


శా.

అబ్రహ్మణ్యము! లోన వైచికొనె నన్యాయంబున న్మత్సుతం
దా బ్రహ్మాదుల మేర నిల్పియుఁ బ్రభుత్వం బూఁదియుం దోఁతురే
యీ బ్రక్కన్ ద్విజుఁ జూడ రయ్య నభవా రీరంగభృత్త౦చు దుః
ఖాబ్రాశిం బడి భాష్పకంఠుఁడు సముద్యద్ధోఃపలాలుండు నై.

44


శా.

అంతే వేడుకయైనఁ బెండ్లగుట కీ నా, దేహము న్బ్రాణమున్
సంతానంబు నిశాంతము న్ధనము సస్యంబు ల్పశుశ్రేణు లే
కాంతస్వస్వజనార్చనంబునక కాదా కూర్చుటే, మీ, కయో
వింతే, యీ బుడు తెంత. న న్గుఱుచఁ గావింపం దను న్మెత్తురే?

45


చ.

శివుఁడు విరించి వాసవుఁడుఁ జెప్ప నశక్తులు గొల్చినట్టి వా
రవుట నిరంకుశుండ నని యక్కట పాడిఁ దొఱంగఁ జెల్లునే?
భువనము లెల్ల నీవయినఁ బొంత దయానిధి యమ్మ లేదె? భా
గవతులు లేరె? నా కొఱకుఁ గాఁగ వహించుకొనంగఁ గేశవా!

46


ఉ.

నెట్టన యల్ల లచ్చి యల నీళయు భూసతి యుండ నీకు నీ
నెట్టిక సీలపై మనసునిల్చుట కేమనవచ్చు? వెఱ్ఱి యౌ
నట్టుగఁ బేద నన్నుఁ బరిహాసము సేఁతకుఁ దక్క వింతచూ
పెట్టిది? దిద్దు నెవ్వఁ డిల నేఱులవంకలు వారిడొంకలున్.

47


వ.

అని యిట్లు ధరణీసురుం డదవెట్ట భాగవతక్షోభంబునకు భువనభర్తయు
భయంపడి తచ్ఛాందసంబునకుఁ గేలిసేయుచున్నవాఁ డను భావం బతనికిఁ
దోఁప మకరకుండలమండితంబు లగు గండదర్పణంబులం జిఱున వ్వెలర్ప
నిట్లనియె.

48


చ.

ముది మదిఁదప్పితోటు మునిముఖ్య! భవత్తనయ న్గృహంబునన్
బదిలము చేసి వచ్చి మఱి బట్టబయ ల్వెడదూరు దూరె, దా
సదన మిఁ కొక్కమా టరసి చంచలలోచనఁ గాన కున్న రూ
రెదు మఱి కాని బుద్ధివివరీతతఁ బొందక పోయిచూడుమా.

49