పుట:ఆముక్తమాల్యద.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


జందుర కావిజీ బమరఁ జల్లని రేయిటి తట్టుపు న్గళు
ల్విందులఁ దేల నూనెముడి వెండ్రుకలున్ దడి తావు లీనఁగన్.

90


తే.

బోటి గట్టిన చెంగల్వ పూవుటెత్తుఁ
దరు పరిణ తోరుకదళమంజరియుఁ గొనుడుఁ
బోయి గుడి నంబి విజనంబుఁ జేయఁ జొచ్చి
మ్రొక్కి వేదికఁ బలువన్నె మ్రుగ్గు వెట్టి.

91


తే.

కపిలగవి సర్పిఁ బృథు దీపకళికఁ దీర్చి
ద్వయముతో వక్షమునఁ గల్వదండ సేర్చి
యగరుధూపంబు లిడి శర్కరాజ్యయుక్త
హృదయకదళీఫలాళి నైవేద్య మొసఁగి.

92


క.

ఖండిత పూగీ నాగర
ఖండంబులు ఘన శశాంక ఖండంబులచే
[1]హిండితమగు తాంబూల మ
ఖండస్థిరభక్తి నొసఁగి కదలి చెలులతోన్.

93


తే.

చెలువ గర్భగృహ ప్రదక్షిణముఁ జేసి
వినతయై మౌళి శఠకోపమును ధరించి
చరణతీర్థముఁ గొని తత్ప్రసాదలబ్ధ
మైన మాల్యముఁ దాల్చి గేహమున కరుగు.

94


క.

ప్రతిదినము నిట్లు చని య
చ్యుతపూజ యొనర్చి వచ్చి సుదతి వియోగ
చ్యుతధైర్య యగుచు నయ్యదు
పతిగుణములు ద్రవిడభాషఁ బాడుచునుండున్.

95


తే.

మొదల నాముక్తమాల్యద మదనతాప
తరణి పెనువెట్ట వేఁగిన దక్షిణాశ
మత్కృతోష్మకుఁ దుదముట్ట మాఁడు ననుచుఁ
దొలఁగె నన నుత్తరాశకు, దొలఁగెఁ దరణి.

96
  1. హిండితములు గావించి య