పుట:ఆముక్తమాల్యద.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఆ.

నల్లగ్రోల నిచ్చి మెల్లనె చివ్వంగి
నోటి జింకఁ దివియు నేరు పొదవు
వేటకాఁడు వోలె విషయాళి వలనఁ ద
త్తృష్ణఁ దీఱనిచ్చి త్రిప్పు టొప్పు.

193


వ.

కావున, నట్లయిన నితని నింక నుపేక్షింపరా; దుపాయంబునఁ జొచ్చి యొక్క
రీతిం ద్రిప్పవలయు, నుర్వి నాహారదోషంబు విజ్ఞాననాశంబునకు మూల
కారణం; బని వితర్కించి.

194


క.

ముల్లు దలకొనని నవకపుఁ
బల్లవములతోడ ముక్తిభామ చెవులకుం
బల్లేరుఁబువ్వులగు పువు
లుల్లసిలు నలర్కశాక మొదుగుగఁ గొనుచున్.

195


తే.

తెచ్చి, యొకవైష్ణవుఁడు గానుకిచ్చె, ననుచు
బానసపు బాడబులచేతఁ బంపుటయును,
నతఁడు ప్రియపడి వండించి యారగింపఁ
దెచ్చు నిచ్చఁ, గొన్నాళ్లిట్లు తెచ్చుచుండ.

196


వ.

ఒక్కనాఁ డతండు భోజనసమయంబున నలర్కశాకాస్వాదనంబు సేయుచువచ్చి,
తచ్ఛాకంబు నంజుచుం దలంచుకొని, 'యేత దానేతయగు భాగవతు భోజనా
నంతరంబ మమ్ముం గాన్పింపు' డని పలికి, పాణిపాదప్రక్షాళనాచమనానంత
రంబ గాన్పించుకొని, నమస్కరించి, వచ్చిన ప్రయోజనం బడుగుటయు, నతం
డిట్లనియె.

197


క.

మీ పెద్దలు గూర్చిన ని
క్షేప మొకటి సహ్యజాతసింధుజలాంత
ర్ద్వీపమున నుండ నీకుం
జూపంగా వచ్చితిని వసుమతీనాథా!

198


క.

నా కేటికి నిక్షేపము
నాకు, నిధియు నాకరంబు నరనాథుల సొ
మ్మే కాన విన్నవించెద,
నాకర్ణింపుము తదీయ మగువిధ మెల్లన్.

199