పుట:ఆముక్తమాల్యద.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తఱ చగుట శాబ్దికులయంద; కాక, యితరస్థలంబుల లేకుండ రాజ్యపరిపాల
నంబు సేయుచుండె.

187


తే.

తత్పితామహుఁ డైన నాథముని శిష్యుఁ
డైన శ్రీపుండరీకాక్షు ననుఁగుశిష్యుఁ
డైన శ్రీరామమిశ్రాఖ్యుఁ డార్తిఁ దనదు
పరమగురు పౌత్త్రునకు నిట్టి బంధ మెట్లు?

188


వ.

యోగసామ్రాజ్యంబు మఱచి సామ్రాజ్యంబునం దాసక్తుఁ డయ్యె; నట్టి
మహాత్మువంశంబునం బుట్టినట్టి యితం డి ట్లగుట యతివ్యతిక్రమంబు.

189


సీ.

వృషశైలఝరవారిఁ ద్రిషవణస్నానంబు
                   నిష్ఠఁ గావించి, యాహ్నికముఁ దీర్చి,
యేకాంతగుహతత్తటీకుశాసనమున
                   నుండి, లక్ష్మీశాంఘ్రిపుండరీక
మంకురత్పులకహర్షాశ్రువై దహరపు
                   ష్కరమున భావించి, సవిత దిరుగ
యజ్ఞోపవీతపద్మాక్షమాలికలతో
                   యోగపట్టికఁ గూడి యురము మెఱయ,


తే.

శౌరిఁ దద్ధరణీధ్రవాస్తవ్యుఁ గొలిచి,
సతియు నాలర్కశాక మంచితము వండ,
ని ల్ముకుందున కర్పించి. వేల్మిఁ దీర్చి,
యిట్లు తనుయాత్ర నడపు ము న్నితనితాత.

190


క.

తొడిఁబడి విషయాతురు నవి
విడు మనియెడు కంటెఁ గలదె వేఱే పగ? నే
ర్పడరఁ గథాదుల నొక వెం
బడి దోఁపం బలికి మైత్రిఁ బాపుట యొప్పున్.

191


క.

వసుధం బుత్రాదికదు
ర్వ్యసనముసైతమును దండ్రి వారించుటకున్
వసపడ దఁట; మఱి రాజ్య
వ్యసనము వారింపఁ నెంతవాఁ డెవ్వాఁడున్?

192