పుట:ఆముక్తమాల్యద.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

అంబరవాసు లగ్నిఁగ్రియకై ద్యుమణిస్ఫటికోపలంబునం
దుం బడయ న్శరజ్జలదతూలపరంపరఁ గొంత పై ఘటిం
పం, బెలుచం జనించి, యొకమట్టున నిల్వక యాక్రమించెఁ గాఁ
కం బరితాప మూన ననఁ గాసె మొగి ల్విరియెండ లత్తఱిన్.

160


క.

కంజహితాస్తోదయముల
సంజకడల, నడుముఁ గప్పు, సంధిల, మి న్నొ
ప్పెం జూడఁ బ్రకృతిశబరీ
గుంజానాసావిభూష కొమరు భజింపన్.

161


తే.

గూండ్లకై శాలిమంజరు ల్గొనుచు, మూఁగి,
యంబరంబునఁ బఱచు కీరాళు లొప్పెఁ,
బసరుటొండొంటియాకుతోఁ బండఁ బాఱి
ఛేదభయమున నెగసిన చే లనంగ.

162


సీ.

శ్రీలు దా రౌట నాశ్రితపద్మకర్ణికా
                   కృతిఁ జెవుల్కమలకర్ణికల మెఱయ;
నతనుసారథ్యకృదతిరేఖ మంచెపై
                   నగలించు రొద చిల్క పదువుఁ బఱవ;
దోగమొగ్గలను వైవ దూర మేగమిఁ బెట్టు
                   చప్పట్లఁ జన్నులు జడలు గదల;
పెడత్రోవ మును చెప్పి, వడి నవ్వ, దిరుగు న
                   ధ్వగుకొలందినె యపత్రపయు మరల;


తే.

నధరరదనప్రసాదంబు నడుగ నోరు
దెఱచె ననఁ బండి వ్రీలి ముత్తెములు తోఁచు
చెఱకు జంఘలఁ బోలమి శిరసు వాల్చు
రాజసముఁ గాచు గోపికారాజి వొలిచె.

163


తే.

నింగి యత్తఱిఁ దా మహానీల మైన
గరిమకుం దగ బహుతృణగ్రాహి యయ్యె
ననఁగఁ బరిణత కలమాది యవసరాశి
తతులు గిరు లన నభ్రంకషతఁ జెలంగె.

164