పుట:ఆముక్తమాల్యద.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.

అయనిష్ఠన్ ధవళాతపత్రి దగు నయ్యాగంబు సాగంగ, నం
దు, యమిశ్రేణులు రాఁగఁ బుంగవకకుత్స్థుం డల్ల వర్షాదినా
త్యయరాముండు సలక్ష్మణుం డినున కోజోవాప్తిగా, విల్లు ని
ర్దయతం ద్రుంప బ్రభగ్నశాల్యవని సీతాలబ్ధి గాకుండునే.

165


క.

మొగిలువిరియెండవేఁడిమి
నిగుడ, శుకశ్రేణి పనరు నింగి న్నిండన్,
బెగడెఁ బ్రజ హరితవాజుల
గగనమణిస్యందనంబు గదిసెనె యనుచున్.

166


తే.

భువి నరఃకైరవశ్రేణి పోవఁదోల,
దీవిఁ గనద్గ్రహనక్షత్రదీప్తి దఱుముఁ,
గృష్ణపక్షపువాసి లే కిరులు దనదు
నలుపునను గూడె నన నైల్య మొలసె నభము.

167


క.ౖో

క్రేపుఁ దలఁచి పని మేయుచుఁ
జేపినపాల్గలయ నెండచేఁ బాంథజనుల్
దూపింపమి కజుఁ డంపిన
యాపాగా యనఁగ నదుల నంచలు మెఱసెన్.

168


తే.

వెద మొదవు కూడఁ బోలేనివెచ్చ గ్రొవ్వు
కల్ప మెడచాఁప వెడలెనో యనఁగ, నెట్ట
కేలకును గ్రుంగి తెచ్చు ఱంకెలు నిగుడఁగ
మందగతి గున్కె వృషభము ల్మందపిఱుఁద.

169


తే.

శరధిజల మెల్ల రిత్తగాఁ గురియ, నుప్పు
డొక్కఁ బేరిన, నత్తెల్పె చిక్కి మీఁద
గాన నగుచున్న దచ్ఛతచే, ననంగఁ
బఱచు శరదభ్రములమేని పాండు వమరె.

170


క.

శరనిధి మును గ్రోలిన ని
ర్భరజలములు గురిసి, మేఘభావం బఱి, య
క్కరములు కరములె కా, జిగి
నొరిమె, ననన్ రవియు మెఱసె, నుడిగెను మొయిలున్.

171