పుట:ఆముక్తమాల్యద.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

భూభిదాపాది దుర్భరాంభోభరంపు
వడి మరుజ్ఝంఝఁ దెరలక కడవ వంచి
నట్లు హోరని ధారౌఘ మైక్య మొంది
విన్ను మన్నును నొకటిగా వృష్టి బలపె.

91


మ.

అల పర్జన్యుఁడు కేకిపాత్రముల గుం పాడించుచో మేఘమం
డలపున్ మద్దెళ గ్రుంగ లేవను, మరున్మార్దంగికుం డర్థి నొ
త్త లలిన్ నేలకు వ్రాలుచు న్నెగయుచుం దారాడు న త్తెల్ల జ
ల్లులుఁ గెంగ్రుచ్చులు నయ్యె ధారలును దల్లోలేంద్రగోపంబులున్.

92


ఉ.

ఓహరిసాహరిం బ్రథమ మొల్కెడుధారల గాడ్పు లేటవా
ల్గా హతి నీడ్చి, వీఁగు ప్రజలం గలఁప న్మొగి లొందె నంబుభృ
ద్వాహచలద్రథత్వము, మొద ల్మెఱుఁగన్ ధ్వజ మెత్త నౌటగాఁ
నాహదనం జెలంగుజన మాంతము నూరట వోవ రామియున్.

93


తే.

మిగుల నామనిఁ బచ్చ చాంపేయకముల
నమ్మి, కడపటఁ దము వైచి, నాఁడు మగడ
నాసపడువారి నవ్వున ట్లల్ల విచ్చెఁ
గలయ, మూతులు కేతకీగహనతతులు.

94


చ.

అనయము నందనంబు దివియందునె యుండి ప్రసూనవాసనల్
గని పఱతెంచిపోవు నలకారుమెఱుంగులె పోవ రాక చి
క్కెనొ నవగంధలుబ్ధభుజగీపరివేష్టన నా మొగళ్ళ పిం
డునఁ జెలగెం బసిండితగడుం దెగడుం బువురేకు మొత్తముల్.

95


చ.

బలుసెక నించువి ల్లడుగుఁ బట్టినదే యిపు డాకుబూది గెం
పులఁ ద్రిరుచిత్వ మూఁది, మరుముష్టిబిగిన్ దివిఁ గ్రాయు మౌక్తికం
బులజడి జుమ్మనం దొరఁగఁ బో; యిది యింద్రునిదేని, పుట్టరాఁ
గెలసమొ నాఁగ బో ల్విలుజిగిం గరకాస్రుతి నొప్పె మేఘముల్.

96


చ.

అతిజల మబ్ధిఁ గ్రోలెఁ నితఁ, డంతయు రా నతివృష్టి దోష మౌ;
మితి నిపు డబ్దతం బరిణమించినతోయమె చాలుఁ బంట; క
న్మతి నలధాత గట్ట గగనంబున, వర్తులత న్సమంతతో
వృతి యగు సేతుమండలము శ్రీ పరివేషము సుట్టె భానునిన్.

97