పుట:ఆముక్తమాల్యద.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

దినముల వెంబడిం జడనిధి న్మును గ్రోలిన నీరిలోనఁ బే
రిన లవణంపుఘట్టముల దృప్యదిరమ్మదదావముల్ దవు
ల్కొని పెటిలించు నార్భటు లొకో యన నౌ సతటిద్భయంకర
స్తవితములన్ సృజించె నతిసాంద్రఘనాఘనగర్భగోళముల్.

86


మ.

ఇనరశ్ము ల్తృష వార్ధిఁ జేరి జల మొక్కిం తాన, నాత్మోష్మఁ జు
య్యని వెంటం బొగ ముంచికో నెగసి, వాతాధూతతత్సంధులం
గన నౌచుం గళదశ్రులై వడకురేఖం దిక్తటప్రోత్థిత
స్తనయిత్నుచ్చటఁ జంచల ల్మెఱసె నాసారంబు దోరంబుగన్.

87


మ.

ఇలనుం గల్గిన జీవనంబుల నిజానిష్టోగ్రమార్తండమం
డల మానం, దయ వైరివైరి సఖుఁ డౌటం దద్రవిం బీల్చి, య
య్యిల కొక్కుమ్మడిఁ గుమ్మరింపఁ దగుఁ దా నెంతైన, నంతైన మం
డలమున్ రాహు పొసంగఁ దాల్చుగతి మింటం బర్వెఁ గాలాభ్రముల్.

88


తే.

పుట్ట వదలి నభోభిత్తిఁ బట్టు శక్ర
కార్ముకపుఁ బెద్ద పలువన్నె కట్లజెఱ్ఱి
దైన నడచెడు కాళ్ళగుం పనఁగ గాలిఁ
గార్కొని దిగంతముల వానకాళ్లు నడచె.

89


చ.

ఒకచినుకు న్ససస్య యగు నుర్వికి డిగ్గఁగ నీవు మూఁగి చా
తకము, లటంచుఁ లోఁ గనలి దట్టముగా నలమేఘుఁ డాడుచుం
డక చన నూఁదఁగాఁ దొరఁగు నాళపుటుండలు వోలె రాలెఁ ద
క్కక పడువర్షధారల ముఖస్థము లై కదకానికాయముల్.

90


సీ.

ఎలగోలుజల్లు మున్ పెళపెళ నేటవా
                   ల్పడి గాలి నట్టిండ్లఁ దడిపి చనఁగ
నట్టె తో వడగండ్ల కట్టావులు దుమార
                   మావుల రేఁచి రెండవదియుఁ జన
మఱి మూఁడవది నిల్చి మెఱసి బిట్టుఱిమి శీ
                   కరవారి సృష్టిఁ జీకటిగ నలమ
నుయ్యెలచేరుల యోజఁ బై పై వెండి
                   జల్లుపైజల్లు పె ల్లల్లుకొనఁగ