పుట:ఆముక్తమాల్యద.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

అప్పలుకులు విని ఖిన్నంబై యక్కూడినపాషండషండంబు దలవంచుకొని
పోయిన, నాయుర్వీధవుండు నతని మాహాత్మ్యంబునకు సంతోషించి సా
ష్టాంగ మెఱఁగి, హర్షామృతరసోత్తరంగితాంతరంగుండై, భుజగశయన
చరణకుశేశయభక్తి వొడమి కృతార్థతం బొంది, పాండ్యమండలమునకు
భాగినేయుండ పట్టార్హుండు గావునఁ బాత్రంబని బ్రహ్మచారి యగునతనికిఁ
దన కడగొట్టు చెలియలిం బరిణయంబు సేసి, యరణంబుగ నమ్మహాత్మునకు
ధారాపూర్వకంబుగా నర్ధరాజ్యం బిచ్చి, యువరాజుం జేసి, యధీతసాంగవే
దుండగునతనికి నథర్వశిరినస్సభ్యస్తం బని యెఱింగి, యందు దివ్యాస్త్ర
మంత్రంబుల కలిమియుం దెలిసి, యమ్మహాత్మున కెచ్చరించి దుస్సాధం
బగువిరోధియూధంబు సాధింపు మని దండయాత్రం బనిచిన, నయ్యాము
నుండును సన్నద్ధుం డగుతఱిఁ తత్పురోహితప్రధానమంత్రివర్గంబు సన్నిహి
తంబు లగునివ్వార్షికదినంబులు గడపి శరత్సమయంబున విద్విషత్సంహారం
బునకు విజయంబు సేయు మనుటయు, నత్తెఱంగు రాజున కెఱింగించి తత్స
మ్మతంబున నిలిచె నంత.

75

వర్షాకాలవర్ణనము

ఉ.

కర్కశుఁ డంట కోర్వ, కుదకంబులు వాఃపతి గూర్చినట్లు న
య్యర్కుఁడుఁ దానుఁ గూర్చి మణి యాసలిలాధిపచిహ్నవాహతం
బేర్కల గంగ నాతఁ డెలమి న్మకరస్థితిఁ గన్ననీర్ష్య, దాఁ
కర్కటకస్థుఁ డయ్యెనన, గర్కటకస్థితిఁ గాంచె నత్తఱిన్.

76


తే.

వనతతివరాహవాహారివాయుభుగ్వి
రోధివారణవర్షాభు లాధిఁ దొఱఁగె
నెండ్రి రవి చేర; మూఁడవయెడకుఁ జేరు,
తరణి ధరణిం బ్రమోదసంధాయి గాఁడె?

77


తే.

వనధిగమనజగర్భార్కజనితఘృణులు
మఱి ప్రసూతికి నతనిధామంబుఁ జేరె;
ఘనతఁ జొచ్చినయిండ్లను దనుజ లుండి
కాన్పునకుఁ బుట్టిని ల్చేరుక్రమము గనమె?

78