పుట:ఆముక్తమాల్యద.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యమ్మ దెచ్చినవిద్వాంసుఁ డనఁగ వలవ,
దెట్లు గావింపవలయు, నట్లట్ల చేయు.

69


వ.

అని యులుకు విడిచి పలికి, మగుడం గూర్చుండి, యతని యనుమతి వాదం
బునకుం దొడంగి.

70

అన్యమతఖండనము

సీ.

అందులో నొకమేటి కభిముఖుండై యాతఁ
                   డనిన వన్నియును ము న్ననువదించి;
తొడఁగి యన్నిటి కన్నిదూషణంబులు వేగ
                   పడక తత్సభ యొడఁబడఁగఁ బల్కి;
ప్రక్కమాటల నెన్న కొక్కొకమాటనె
                   నిగ్రహస్థాన మనుగ్రహించి;
క్రందుగా రేగినఁ గలఁగ కందఱఁ దీర్చి
                   నిలిపి; యమ్మొదలివానికినె మగిడి;


తే.

మఱి శ్రుతిస్మృతిసూత్రసమాజమునకు
నైకకంఠ్యంబు గల్పించి, యాత్మమతము
జగ మెఱుంగఁగ రాద్ధాంతముగ నొనర్చి;
విజితుఁ గావించి దయ వాని విడిచిపెట్టి.

71


క.

'నీ వేమంటివి రమ్మం',
చావలివానికిని మగిడి యట్లనె వానిం
గావించి, యొకఁడొకఁడు రా
నావిప్రుఁడు వాదసరణి నందఱఁ గెలిచెన్.

72


వ.

ఇట్లు జయించి విష్ణుదేవుండె పరతత్త్వం బనియు విశిష్టాద్వైతంబ మతంబు
నగుటయుం బ్రతిష్ఠించిన.

73


క.

ఆయెడను నొక్కపలు కెదు
రై యుండెడు పిప్పలమున నాయెను విన "నో
హో, యిది నిక్కము, నృప, నా
రాయణుఁడె పరంబు, కొల్వు మతని" నటంచున్.

74