పుట:ఆముక్తమాల్యద.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

వాదుల మటంచుఁ జెప్పించి వత్తు; రోట
మైన దయ నీరె యేమైన నని విలజ్ఞ
జూటుఁదనమున సభ లెక్కు చొరవకాండ్రు;
పాఱువారల సుద్ది సెప్పంగ నేల?

61


వ.

అని పలికి దరహాసంబుతో దేవిదెసఁ జూచి యి ట్లనియె.

62


క.

'అస్మన్మతస్థుఁ డోడిన
భన్మము రుద్రాక్షములును బాసి యితనిచే
విస్మయముగ నాప్తము ముర
మస్మరచక్రాంకితుండఁ గాఁ గలవాఁడన్.

63


తే.

ఉవిద, యీనీదువిద్వాంసుఁ డోఁడెనేని
నీకు నితని కే నన్నపూనికయ' యన్న,
‘నొప్పితిమి దేవ రానతి దప్పకున్నఁ
జాలు మఱి పంచభూతము ల్సాక్షిగాఁగ.

64


వ.

అని పలుకు నయ్యిరువుర ప్రతిజ్ఞ లాకర్ణించి.

65


తే.

అతఁడు మృగకృత్తి పెళపెళ యనఁగ, బసుపు
గోచి కట్టిన మోదుగుఁగోల నెగయఁ,
బ్రాంజలి వినీతుఁడై విన్నపం బటంచు
నర్ధముక్తాసనత నిట్టు లనియె ధృతిని.

66


క.

"దేవా, యిట్లని యానతి
యీ వల, దేఁ గడుపుఁగూటి కిట రా, నా డ
బ్బేవారిఁ బ్రోవ? భిక్షా
జీవిక వర్ణికిని విధి సృజించెనె గాదే?"

67


తే.

ఎవ్వఁడే సర్వభూతస్థుఁ డిత్తెఱంగు
నకును బ్రేరేఁచె, నతనియానతియె తెచ్చె,
నెఱిఁగినవి నాల్గు నొడువ నేమయిన లెస్స;
యతఁడ బొంకిన నేమి సేయంగ వచ్చు?

68


తే.

పంతమైనను గానిమ్ము పార్థివేంద్ర,
యుక్తులను నిగ్రహస్థాన మొదవెనేని,