పుట:ఆముక్తమాల్యద.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఆ.

ఆత్మకాని మేన నాత్మబుద్ధియును న
స్వంబునందు మిగుల స్వత్వమతియు
నవనివర, యవిద్య యను మహాతరువు ను
త్పత్తి కీద్వయంబు విత్తు మొదలు.

66


క.

నరనాథ, పాంచభౌతిక
శరీరమున దేహి మోహసాంద్రతమతమః
పరివృతుఁ డై, 'యే నిది నా
పరికర' మని యవధి లేనిభ్రమఁ బడి తిరుగున్.

67


క.

జలవసుధాంబరపవన
జ్వలనంబులకంటెఁ దా నజస్రంబు వెలిన్
వెలుగొందు నాత్మ యుండఁగఁ
గళేబరము నెవ్వఁ డాత్మగాఁ దలపోయున్?

68


సీ.

వపు రుపభోగ్యముల్ నృప గృహక్షేత్రాదు;
                   లవి బొందివౌఁగాక, యాత్మ నగునె;
య ట్లన పుత్త్రపౌత్త్రాదికములు నాత్మ
                   కాని మైఁ బుట్టుటఁ, గావు తనవి;
గాన మృత్యువుఁ గను కాయంబున జనించు
                   పుత్త్రాదులేక స్వత్వబుద్ధి దగదు;
ఎపుడేని యాత్మ వేఱే యనునప్పుడె
                   యడరు భోగంబు లీయాత్మకంట;


తే.

వట్లుగా కీయొడలె యాత్మ యన్న నంటు;
మద్గృహము నిల్చు నెట్లల్కు మృజ్జలాది
నట్లు భౌతికభోగాశనాదిభౌతి
కాంగములు నిల్చు; భోగ మిం దాత్మ కెద్ది?

69


మ.

జని సాహస్రబహుప్రయాణ మగు సంసారంపుఁ ద్రోవన్ సదా
చనుచుండున్ ఘన మోహఖేద మలమన్ సంసారిపాంథుండు, వా
సన లన్ ధూళి ముసుంగు గాఁగ: నెపుడేన్ జ్ఞానంపు టుష్ణోదకం
బునఁ దత్క్షాళన సేయు వాని కపు డమ్మోహశ్రమంబున్ జనున్.

70