పుట:ఆముక్తమాల్యద.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.

'విను కేశిధ్వజ, ధాత్రి వేఁడమికి నా వేదించెదన్ హేతు: వ
జ్ఞునకుంగాక వివేకి కేల జనియించున్ లౌల్య మెందున్? రణం
బునఁ బాడిన్ రిపుఁ గూల్చువాఁడియుఁ బ్రజాపోషంబు ధర్మంబు రా
జున కౌ; నైన నశక్తుఁ ద్వద్విజితరాజ్యు న్న న్నఘంబంటునే?

61


సీ.

నరనాథ, యీ రాజ్యపరిపాలనారాతి
                   హననాదికృతరూప యగు నవిద్య
యనధికారికి విసర్జనముఁ గావింపంగఁ
                   గలుషంబు రా; దధికారియైన
వాఁడు విసర్జింప వచ్చు వర్ణాచార
                   లోపంబుచే నగు పాపలేప;
మైన నేనిత్తుఁ గొమ్మనఁ గొను ధరణి భో
                   గమునకుఁ గాక ధర్మమున కగునె?


తే.

కాన సత్క్షత్త్రియులకు భైక్ష్యంబు కీడు;
మత్ప్రధానులు వేఁడు సామ్రాజ్య మనెడు
పలుకు ధర్మచ్ఛలంపు లోభం బయుక్త
మిది యెఱిఁగి రాజ్య మడుగ నే నిచ్చగింప.

62


తే.

ఆస పడుదురె బుధులు, రాజ్యంబు, మమత
మానని జడాత్ముల? ట్లహం మాన పాన
మత్తులకుఁ గాక యది యేల మాదృశులకు?"
ననిన హర్షించి మెచ్చి యజ్జనకుఁ డనియె.

63


ఆ.

"ఏ నవిద్యవలన మృత్యువుఁ దరియింప,
ననఘ, రాజ్యములు మఖాదికములుఁ
జేయుచున్నవాఁడ, క్షీణింపఁజేయుదుఁ
బుణ్యఫలము భోగభుక్తిచేత.

64


క.

మన యీ నిమివంశము పా
వన మగుభాగ్యమున, మనుజవర, తత్త్వవివే
చనచింత నీకుఁ బొడమెను ;
విను మిఁక వినిపింతు నే నవిద్యావిధమున్.

65