పుట:ఆముక్తమాల్యద.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

నావుఁడు, వార లమ్మనుజనాథున కిట్లని రుబ్బి: "నేఁడుగా
దైవము గల్గె; వేగ గురుదక్షిణగాఁ జతురర్ణవీవృతో
ర్వీవలయం బశేషమును వేఁడుము, భూవర; మమ్ము నందఱన్
బ్రోవుము; బాంధవాప్తజనపోషణకన్నను బుణ్య మున్నదే!

56


ఉ.

ఎన్నఁడు లావుగూడు మన? కెన్నఁ డగున్ దఱి? యయ్యెనేని పో
రెన్నిక యౌనె? పోరిన జయింపనె చెప్పిరె? నీదు భాగ్యసం
పన్నతఁ జేరెఁ గార్య మిటు; బంధు సుహృత్తతి కొక్కకీడు రా
కున్నటు లుండఁగానె; సిరు లూరక చావక నోవ కబ్బునే?"

57


చ.

అనవుడు నల్ల నవ్వి మనుజాధిపుఁ డిట్లను:- " మీర లర్థసా
ధనపరతంత్రకోవిదులు దక్క, మహాసుఖదాయి మోక్షమా
ర్గ నయ విచారకోవిదులు గా, రతిచంచల రాజ్యలక్ష్మి నే
మని చని వేఁడువాఁడఁ బరమార్ధము వేఁడక యమ్మహామతిన్?

58


క.

నిమివంశోత్పన్నులమఁట
మముబోఁటుల కకట రాజ్యమా లక్ష్యము? వాఁ
డమలిన యోగాశ్రయుఁ; డు
త్తమయోగము గొనుట యురవొ, ధరఁ గొను టురవో?

59


సీ.

విడుఁ." డని వీడు వెల్వడి వచ్చి ఖాండిక్యుఁ,
                   డారాజుఁ గనుఁగొని గారవమున,
'గురునిష్క్రయంబు నిక్కువముగా నొసఁగెదే?'
                   యని పల్కి, 'యిత్తుఁ దథ్యముగ' నన్న;
'నవనీతలేంద్ర, వీ వధ్యాత్మరతుఁడవు ;
                   దక్షిణ గురున కీఁ దలఁచితేని,
సకలభవక్లేశసంక్షయం బెయ్యది
                   'యవ్విద్య బోధింపు' మనిన నవ్వి,


తే.

'యహహ! నిష్కంటకాన్మదీయాధిరాజ్య
మడుగ నొల్లక యిది యేటి కడిగి తిపుడు?
క్షత్త్రియుల కెల్ల రాజ్యంబు కంటె మఱి ప్రి
యంబు గలదె? యటన్న ని ట్లనియె నతఁడు.

60