పుట:ఆముక్తమాల్యద.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

పరలోకసుఖము శాశ్వత
మరయ; మహీరాజ్యసౌఖ్య మల్పానేహః
పరిభోగ్యం; బిందులకై
దురితము కావించి తొలఁగుదునె పరమునకున్?

49


క.

"బద్ధాంజలిపుటు దీనున్
గ్రుద్ధుండై శరణు చొరఁగఁ గూల్చుట కడుఁ గీ,
డుద్ధతి పరలోకార్జన
బుద్ధికి" నను కణ్వవాక్యములు దలఁప రొకో!

50


ఆ.

అనుచు వెడలి వచ్చి, యారాజు నడిగి, త
ద్ఘర్మనైచికీపథక్రమంబు
దెలిసి, తగిన నిష్కృతి వచింప నాతండు
మగుడఁ గ్రతువు సాంగముగ నొనర్చి.

51


ఆ.

అవభృథాప్లుతోత్తమాంగుఁడై : ఋత్విక్స
దస్యగణముఁ బూజఁ దనిపి, పిదప
సూతమగధవందివైతాళికప్రభృ
త్యర్థికోటి కభిమతార్థ మొసఁగి.

52


తే.

మఱియుఁ గోరినవారి యక్కఱలు తీర్చి
యును మన:పూర్తి చాల కొయ్యనఁ దలంచి,
'యకట గురుదక్షిణ యొసంగ నయితి' నంచు
మగుడఁ జని, శంక నతఁడు సంభ్రమపడంగ.

53


క.

వారించి, 'నీకు నెయ్యది
కోరిక? యేతెంచినాఁడ గురుదక్షిణ యీ,
భూరమణ, వేఁడు' మనుటయు,
నారాజన్యుండు మఱియు నాప్తులతోడన్.

54


క.

'గురుదక్షిణ యిచ్చుట కీ
నరవరుఁ డేతెంచె; మీరు నా కనురక్తుల్;
పరికించి పదింబదిగా
నరయుఁడు మది నెద్ది మేలు ప్రార్ధించుటకున్.'

55