పుట:ఆనందరంగరాట్ఛందము (కస్తూరి రంగయ).pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
జానకీనాయకశతకమున
మ.

కసుమాలం బగుదేహి పుట్టువు(ను)ల నీకష్టంబులం బాపి ది
వ్యశరీరం బొనరింతు వెప్పుడు నిను న్వాక్రుచ్చినన్ యోగిమా
నసగేహంబుల నుండి లోహము సువర్ణచ్ఛాయలం జేయఁగా
రసవాదంబుల నేర్చికొంటె రఘువీరా జానకీనాయకా.

107


వ.

ఈరీతిని అనేకకవులు చెప్పినారు గనుక తెలియగలదు.

108

వికల్పప్రాసము

శ్రీధరచ్ఛందమున
గీ.

[1]సానునాసికతనువర్గహల్లులని తృ, తీయలుగ వికల్పప్రాసమై యెలర్చు
ప్ర్రాఙ్నగంబున రవి దోఁచె నగ్నిఁ బోలి, ప్రాఙ్ముఖుండయి నుతియించె వాగ్మి యనఁగ.

109


తా.

అనునాసికసంయోగ మైనయక్షరములు సమానసంధిచేత వికల్పమవును. ప్ర్రాక్ + ముఖము = ప్రాఙ్ముఖము. ఈ ప్రాఙ్ముఖశబ్దము 'గ్మ' ప్రాసమునకు చెప్పవచ్చును. దిక్ + ముఖము = దిఙ్ముఖము, ఈదిఙ్ముఖళబ్దము, 'గ్మ' ప్ర్రాసమునకు చెప్పవచ్చును. ఉద్యత్ + మోదము = ఉద్యన్మోదము. ఈ ఉద్యన్మోదశబ్దము 'ద్మ' ప్ర్రాసమునకు చెప్పవచ్చును.

లక్ష్యము, అనంతచ్ఛందమున
[2]క.

పద్మాసమాన యగుమన, పద్మావతిఁ జూచి ధరణిపాలకసుతుఁ డు
ద్యన్మోదంబున దనముఖ, పద్మము నలరించె ననుచుఁ బరిజను లలరన్.

110
కావ్యచింతామణియందు
గీ.

తిగ్మదీధితి వెలిఁగించు దిఙ్ముఖముల, దిఙ్మహీతలనాథుండు వాగ్మి యనఁగ...

111


వ.

అని యివ్విధంబున మహాకవిప్రయోగము లుదాహరణము లున్నవి గనుక సూచన
వ్రాయడమయినది.

112

ఇక యతి ప్రకరణము

స్వరయతిః భీమనచ్ఛందమున (సంజ్ఞ 64)
క.

స్వరగణము కకారాద్య, క్షరములతో సంధిచేసి కదియించినఁ ద
త్స్వరము కొని చెప్పునవి వ, ళ్లరవిందజసదృశ కవిజనాశ్రయకృతులన్.

113
మఱియును
క.

ఆఅ లై ఔలకు మఱి, ఇఈలు ఋకారసహిత మెఏలకు నౌ
ఊఊ ల్తమలో నొడఁబడి, ఒఓలకు వళ్లగు న్నయోన్నతచరితా!

114
  1. ఈపద్యము అనంతచ్ఛందమున గ్రంథకర్త పద్యముగా ఇచ్చివున్నది. (1-50).
  2. ఇది అనంతచ్ఛందమున కనబడదు.